
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ అనే సినిమా ఇప్పుడు ఎక్కడ చూసిన క్రేజీ టాపిక్‌గా మారిపోయింది. దీపావళి కానుకగా నవంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాణంలో, సూరజ్ భర్జాత్యా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. గతంలో సల్మాన్-సూరజ్‌ల కాంబినేషన్లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ సాత్ సాత్ హై’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు రూపొందాయి. ఇక సల్మాన్ నటించిన మైనే ప్యార్ కియా తెలుగులో ప్రేమ పావురాలుగా విడుదలై ఇక్కడా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాను తెలుగులో ప్రేమలీల పేరుతో విడుదల చేయనున్న విషయం ఇంతకుముందే తెలియజేశాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఈ సినిమా తెలుగు వర్షన్‌పై ఆసక్తి రేకెత్తించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా తెలుగు వర్షన్ ప్రేమలీల కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల కానుంది. సుమారు 200 థియేటర్లలో సల్మాన్ ప్రేమలీల విడుదల కానుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక హిందీ డబ్బింగ్ సినిమా ఈ స్థాయి థియేటర్ల విడుదల కానుండడం ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇక ఒక్క తెలుగు వర్షన్ మాత్రమే కాకుండా నైజాం ఏరియాలో బాలీవుడ్ సినిమాకు ఎప్పట్నుంచో ఉన్న మార్కెట్ ప్రకారంగా ప్రేమ్ రతన్ ధన్ పాయో కూడా ప్రధాన థియేటర్లలో విడుదల కానుంది. దీంతో దీపావళికి సల్మాన్ ఖాన్ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు.