
ప్రస్తుతం తెలుగు చిత్రసీమ ప్రముఖులు అందరూ ఒకే చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఆ చిత్రమే ‘నా బంగారు తల్లి’. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని అమల ఇలా ప్రముఖుల జాబితాలో చాలా మంది ఉన్నారు. తాజాగా ఈ చిత్రం అగ్ర కధానాయిక సమంత మనసును కదిలించింది. బుధవారం రాత్రి ‘నా బంగారు తల్లి’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు హాజరయిన సమంత, సినిమా పూర్తయిన తర్వాత సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేసింది. నిర్మాత సునీతా కృష్ణన్, చిత్ర బృందంపై పొగడ్తల వర్షం కురిపించింది.
‘గత రాత్రి ‘నా బంగారు తల్లి’ చిత్రం చూశాను. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి తలుపు తట్టి ఈ చిత్రం చూడండి చెప్పడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాలో స్ఫూర్తి కలిగించే మహిళ ఎవరైనా ఉన్నారంటే.. అది ఈ చిత్ర నిర్మాత, ప్రజ్వల ఫౌండేషన్ నడుపుతున్న సునీతా కృష్ణన్ గారు అని చెప్పాలి. లవ్ యు మేడం. ఇప్పటికే ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఈ చిత్ర బృందం అందరికీ నా శుభాబినందనలు’ అంటూ సమంత ట్వీట్ చేశారు.
సిద్దిక్, అంజలి పాటిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. లైంగిక వేధింపులకు గురయిన ఓ మహిళా నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. నవంబర్ 21న, ఈ శుక్రవారం ‘నా బంగారు తల్లి’ ప్రేక్షకుల ముందకు వస్తుంది.