Black Gold: 45 డిగ్రీల మంచిర్యాల ఎండల్లో కఠిన పరీక్ష – సెట్స్ లో ఏం జరిగిందో చెప్పిన సంయుక్త మీనన్

సినిమా అంటే ఒకరి ప్రయాణం కాదు.. ఎంతోమంది చేతులు, మనసులు, ఉద్దేశాలు కలిసి ఒకే దిశగా సాగే ప్రయాణం. ఇదే విషయాన్ని చెబుతూ నటి సంయుక్త తాజాగా ఎమోషనల్ అయ్యారు. ఆమె నటిస్తున్న కొత్త సినిమా ‘బ్లాక్ గోల్డ్’ షెడ్యూల్ రెండు రోజుల క్రితం పూర్తయింది. ఈ సందర్భంగా షూటింగ్ లో ఎదురైన సవాళ్లను, టీమ్ కష్టాన్ని వివరిస్తూ ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. షెడ్యూల్ పూర్తి చేసుకుని, శ్రీవారి ఆశీస్సుల కోసం ప్రస్తుతం ఆమె తిరుపతి చేరుకున్నారు.

మంచిర్యాల ఎండల్లో కఠిన పరీక్ష

‘బ్లాక్ గోల్డ్’ తాజా షెడ్యూల్ మంచిర్యాలలో జరిగింది. అక్కడి వాతావరణం చిత్ర యూనిట్ ను తీవ్రంగా పరీక్షించింది. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో టీమ్ అంతా ఇబ్బంది పడ్డారు. “మంచిర్యాల మమ్మల్ని అన్ని విధాలా పరీక్షించింది. ఎండలు మండిపోయాయి. కానీ మా టీమ్ కూడా అంతే ధృడంగా నిలబడింది. అలసట, వేడిని తట్టుకుని అంకితభావంతో పనిచేశారు. ఆ పట్టుదలకు నేను గర్విస్తున్నాను” అంటూ సంయుక్త తన టీమ్ పై ప్రశంసలు కురిపించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రతి క్రూ మెంబర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంతటి ఎండల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ బారిన పడటం లాంటివి జరిగినా, తన పర్సనల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తల వల్లే తాను నిలబడగలిగానని ఆమె చెప్పుకొచ్చారు. డైరెక్టర్ యోగి గైడెన్స్, నమ్మకం తనకు ఎంతో బలాన్ని ఇచ్చాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ నుంచి తనకు సపోర్ట్ అందించిన నిహారికకు, సెట్స్ లో అన్నీ తానై చూసుకున్న పార్ధుకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. సరైన సమయంలో సరైన వ్యక్తుల మధ్య ఉండటం ఒక అందమైన అనుభూతి అని చెబుతూ.. ఎంత ఎనర్జీతో హైదరాబాద్ నుంచి వెళ్లానో, అంతే ఎనర్జీతో తిరిగి వస్తున్నానని సంయుక్త ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఆమె.. దేవుడి ఆశీస్సులకు, అండగా నిలబడ్డ వ్యక్తులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ ముగించారు.

Exit mobile version