షార్ట్‌ఫిల్మ్‌తో మెప్పించేందుకు సిద్ధమైన స్టార్ డైరెక్టర్!

Director-Vamsi
తెలుగులో హాస్యకథల సినిమాలను ఇష్టపడే వారికి 1980, 90ల దశకంలో స్టార్ దర్శకుడుగా పేరుగాంచిన వంశీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘చెట్టుకింద ప్లీడర్’, ‘లేడీస్ టైలర్’ లాంటి కథా బలమున్న కామెడీ సినిమాలు దర్శకుడిగా ఆయన స్థాయిని చెప్పే సినిమాలుగా చెప్పుకోవచ్చు. ‘అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ తర్వాత ఎక్కువగా ప్రేమకథలనే తెరకెక్కిస్తోన్న వంశీ, తాజాగా ఓ షార్ట్‌ఫిల్మ్ ద్వారా మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.

‘లెటర్’ పేరుతో వంశీ ఈ 15 నిమిషాల నిడివి గల షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించారు. యువత ప్రేమ, బ్రేకప్ అంటూ తమ తమ అభిప్రాయాలను తెలపడం ఎలా ఉందీ అనే కాన్సెప్ట్‌తో ఆయన ఈ షార్ట్‌ఫిల్మ్ రూపొందించారట. మధుర శ్రీధర్ ఈ షార్ట్ ఫిల్మ్‌కు నిర్మాత. త్వరలోనే ఈ షార్ట్‌ఫిల్మ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. ఇక గత కొద్దికాలంగా బాగా పాపులర్ అయిన షార్ట్‌ఫిల్మ్ ట్రెండ్‌ను తెలుగు స్టార్ డైరెక్టర్‌ కూడా ఫాలో అవ్వడం విశేషంగా కనిపిస్తోంది. ఇక వంశీ 25వ సినిమా ‘మెల్లగా.. తట్టింది మనసు తలుపు’ విడుదలకు సిద్ధమైంది.

Exit mobile version