‘అపరిచితుడు’ రగడ ఇంతటితో ఆగేలా లేదు

స్టార్ డైరెక్టర్ శంకర్ ‘అన్నియన్’ హిందీ రీమేక్ ప్రకటించిన వెంటనే వివాదాలు మొదలయ్యాయి. ఒరిజినల్ వెర్షన్ నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఆ కథ తన సొంతమని, తనకు తెలియకుండా హిందీ రీమేక్ చేయడానికి శంకర్ ఎలా సిద్దమవుతారని అంటూ శంకర్ కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. శంకర్ సైతం నిర్మాతకు బలమైన సమాధానమే ఇచ్చారు. కథ పూర్తిగా తన సొంతమని, ‘అన్నియన్’ సినిమాలో కథ, కథనం, దర్శకత్వం అనే టైటిల్ కార్డు తన పేరు మీదనే ఉంటుందని, తన కథను ఏమైనా చేసుకునే హక్కు తనకుందని అన్నారు.

అయితే ఆస్కార్ రవిచంద్రన్ ఈ పంచాయతీని సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వద్దకు తీసుకెళ్లారు. సౌత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రవి కొట్టారకర శంకర్ కు లేఖ రాసి ఆయన సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. శంకర్ ఇచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండనున్నాయి. రవిచంద్రన్ అయితే ఆ కథ నిర్మాతగా తన సొంతమని, దానికి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం తన వద్ద ఉందని, కథా రచయిత లేట్ రంగరాజన్ నుండి కథను కొనుగోలు చేశానని, కనుక తన అనుమతి లేకుండా రీమేక్ చేయడం చట్టవిరుద్ధమని అంటున్నారు. మరి రోజురోజుకు కఠినతరమైన ఈ సమస్యను శంకర్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Exit mobile version