‘చాయ్ వాలా’ ఇప్పుడు ‘నవాబ్ కేఫ్’.. ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్

Shiva-Kandukuri

శివ కందుకూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్‌లో మార్పు చోటుచేసుకుంది. సెన్సార్ బోర్డ్ నిబంధనలు, అధికారుల సూచనల మేరకు గతంలో నిర్ణయించిన ‘చాయ్ వాలా’ పేరును ‘నవాబ్ కేఫ్’గా మారుస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పపుడిప్పు నిర్మించిన ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ముంబై సెన్సార్ అధికారులతో చర్చించిన అనంతరం, వారి సూచనల మేరకే టైటిల్ మార్చామని స్పష్టం చేశారు. ముందుగా అనుకున్న వర్కింగ్ టైటిల్ ‘నవాబ్ కేఫ్’నే ఫైనల్ చేశామన్నారు. టైటిల్ మారినప్పటికీ, సినిమా కథలోని ఆత్మ ఏమాత్రం మారలేదని హీరో శివ కందుకూరి తెలిపారు. ఎంతో నిజాయితీగా తీసిన ఈ చిత్రం చూశాక, ప్రతి ఒక్కరూ తమ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడతారని, అంతలా ఎమోషనల్ కనెక్ట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఏ టైటిల్ ఉన్నా ఆదరిస్తారని హీరోయిన్ తేజు అశ్విని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీవ్ కనకాల కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, అడ్డంకులన్నీ దాటుకుని ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version