ఇంటర్వ్యూ : దర్శకుడు శివ నిర్వాణ – ‘ఇరుముడి’ లాంటి నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు..!

మాస్ మహారాజా రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘ఇరుముడి’. టీజర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

రామ్ చరణ్ గారు ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్తల్లో ఎంతవరకు నిజముంది?

లేదండి, అది సోషల్ మీడియా ప్రచారమే. రామ్ చరణ్ గారు అయ్యప్ప భక్తులు కావడం వల్ల అభిమానులు అలా అనుకుని ఉండవచ్చు కానీ ఆయన ఇందులో నటించడం లేదు. ఈ సినిమా చరణ్ గారికి నచ్చాలని కోరుకుంటున్నాను.

‘ఇరుముడి’ ప్రమోషనల్ కంటెంట్‌తో పెరిగిన భారీ అంచనాలను ఈ సినిమా అందుకోబోతోందా?

ఈ సినిమాలో అయ్యప్ప స్వామి మాల, ఫ్యామిలీ, క్రైమ్ అనే మూడు లేయర్స్ ఉంటాయి. పక్కా ప్లానింగ్‌తో ఒక్కో విషయాన్ని రివీల్ చేస్తూ ట్రైలర్‌తో సినిమాపై అందరికీ క్లారిటీ ఇచ్చాం. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుంది.

రవితేజ గారిని ఇంత కొత్తగా చూపించడం వెనుక మీ ప్రిపరేషన్ ఏమిటి?

ఎవరూ టచ్ చేయని కథను రవితేజ గారి లాంటి స్టార్ హీరోతో చేసినప్పుడే దానికి విశేషమైన రీచ్ వస్తుంది. అయ్యప్ప మాల నేపథ్యం, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఈ కొత్త కథ ఆయన వల్ల ప్రతి ఇంటికీ చేరుతుంది.

‘మాలికాపురం’తో పోలికలు రావడంపై మీ స్పందన ఏమిటి?

అయ్యప్ప స్వామి నేపధ్యంలో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. రవితేజ గారి లాంటి స్టార్ హీరోతో ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో రావడం వల్లనే ‘మాళికాపురం’తో పోల్చారు. అయితే నా కథ ఏంటో నాకు బాగా తెలుసు కాబట్టి దాని గురించి ఆలోచించలేదు. ట్రైలర్ వచ్చాక ఇది ఎవరూ చూడని ఒక వినూత్నమైన సినిమా అని ప్రేక్షకులే గ్రహించారు.

ఈ కథను రాసేటప్పుడే రవితేజ గారిని అనుకున్నారా?

కథ అనుకున్నప్పుడు ఎవరినీ అనుకోలేదు. రవితేజ గారికి చెప్పాకే ఈ పాత్రకు ఆయనే సరైన వ్యక్తి అనిపించింది. ఆయన గడ్డం, తేజస్సు బాగా కుదిరాయి. కథ ఓకే చేశాక ఒత్తిడి లేకుండా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిస్తారు.

‘మల్లెపూల పల్లకి’ పాట గురించి?

‘మల్లెపూల పల్లకి’ పాట 15 ఏళ్లుగా పడిపూజల్లో ప్రతి అయ్యప్ప భక్తుడు పాడుకునే పాట. సీలేరు స్వామి సలహాతోనే ఈ పాటను సినిమాలో పెట్టాం. జీవీ ప్రకాష్ గారు ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ 15 ఏళ్ల క్రితం ఈ ఒరిజినల్ పాటను పాడిన 60 ఏళ్ల డప్పు శ్రీను గారిచేతనే మళ్లీ పాడించి గౌరవించాం. థియేటర్‌లో ఈ పాట ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తుంది.

బేబీ నక్షత్ర గురించి?

‘మనెమ్మ’ పాత్ర కోసం మన ఇంట్లో పాపలా ఉండే నేటివిటీ ఉన్న అమ్మాయి కావాలనుకున్నాం. ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో నక్షత్రను చూసి, లుక్ టెస్ట్ చేశాక మట్టి వాసన ఉన్న ఆ క్యారెక్టర్‌కి తనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాం.

సాయికుమార్ గారి క్యారెక్టర్ గురించి?

గురుస్వామి పాత్రలో సాయికుమార్ గారి ఆహార్యం, నటన అద్భుతంగా కుదిరాయి. ఆ క్యారెక్టర్‌కి ఆయన పర్ఫెక్ట్‌గా సరిపోయారు.

మైత్రి మూవీ మేకర్స్ గురించి?

నవీన్ గారు, రవి గారు దర్శకుడికి చాలా ఫ్రీడమ్ ఇస్తారు. నేను త్వరగా తీస్తాను. అలాగే బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తానని వారికి నమ్మకం. సీలేరులో 250 మందితో కలిసి షూటింగ్ చేశాం. అది మామూలు విషయం కాదు. వారు చాలా సపోర్ట్ చేశారు.

Exit mobile version