ఓటిటి సమీక్ష: ‘అయలాన్’ – శివకార్తికేయన్ సైఫై కామెడీ చిత్రం ఆహా లో (తెలుగు డబ్)

Ayalaan

విడుదల తేదీ : జనవరి 07, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఆహా

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్, యోగిబాబు, భానుప్రియ, ఇషా కొప్పికర్ తదితరులు
దర్శకత్వం : ఆర్ రవికుమార్
నిర్మాత : కే జె ఆర్
సంగీతం : ఏ ఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం : నిరవ్ షాహ్
కూర్పు : రూబెన్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

తమిళ స్టార్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ సైఫై చిత్రమే “అయలాన్”(Ayalaan). గత 2024లో ఇదే సంక్రాంతి సీజన్ లో తెలుగులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా తో ఓటిటిలోనే విడుదల అయ్యింది. మరి అప్పుడు మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ ఏలియన్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

అంతరిక్షం నుంచి భూమిపై పడ్డ ఓ ఉల్క నుంచి భవిష్యత్తులో పవర్ఫుల్ ఇంధన సాధనంగా మారనున్న నోవా గ్యాస్ ని భూమి అట్టడుగు నుంచి తవ్వడానికి ఆర్యన్ ఇండస్ట్రీస్ అధినేత ఆర్యన్ (శరద్ కేల్కర్) దాన్ని స్పార్క్ గా వాడుతారు. ఇది ప్రకృతికి ఎంతో ప్రమాదకరం. ఇంకోపక్క ప్రకృతి అంటే ఎంతో ఇష్టమున్న
అర్జున్ (శివ కార్తికేయన్) అరకులో తన తల్లి (భానుప్రియ) తో వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. కానీ వారికి ఉన్న ఆర్ధిక సమస్యలతో హైదరాబాద్ కి డబ్బు సంపాదించడానికి వస్తాడు. ఈ క్రమంలో అయలా/టాటూ (ఏలియన్) ఆ స్పార్క్ కోసం భూమికి వస్తుంది. మరి ఇక్కడ నుంచి అర్జున్, అయలా జర్నీ ఎలా సాగింది? అయలా స్పార్క్ ఒక్కటి తీసుకొని వెళ్లిపోయాడా? ఆర్యన్ వల్ల జరగనున్న తీవ్ర నష్టాన్ని ఎలా ఆపారు? ఆ నోవా గ్యాస్ అంత ప్రమాదకరమా? అనేవి తెలియాలి అంటే ఈ సినిమా ఆహా లో చూడాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా ఇండియన్ సినిమా దగ్గర ఏలియన్ కాన్సెప్ట్ ని మేకర్స్ అటెంప్ట్ చేయడమే మంచి విషయం అని చెప్పాలి. ఇండియన్ సినిమా చాలా తక్కువ టచ్ చేసిన జానర్స్ లో ఇది కూడా ఒకటి. అప్పట్లో మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమాలో చాలా వరకు ఎలిమెంట్స్ ఆ హైప్ కి తగ్గ రీతిలోనే కనిపిస్తాయి అని చెప్పాలి. మెయిన్ గా ఈ సినిమా ఫ్యామిలీ అండ్ పిల్లలుకి ఒకింత బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు.

కథనం సింపుల్ గానే వెళ్ళిపోతుంది కానీ అక్కడక్కడా మంచి కామెడీ ఇంకా విజువల్స్, ఏలియన్ తో శివ కార్తికేయన్ చేసే విన్యాసాలు లాంటివి కొత్తగా కనిపిస్తాయి. అంతే కాకుండా దర్శకుడు చాలా సన్నివేశాల్లో టెక్నాలజీని చాలా బాగా చూపించిన విజువల్స్ ఇంప్రెస్ చేస్తాయి. అవన్నీ హాలీవుడ్ స్టైల్ లో వాటికి తీసిపోకుండా ఉంటాయి. వీటిని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు.

అలాగే శివ కార్తికేయన్ తన రోల్ లో బాగా చేసాడు. పల్లెటూరి కుర్రాడిగా, ఏలియన్ తో కలిపి ఉన్న అన్ని సీన్స్ ఇందులో వర్కౌట్ అవుతాయి. తనతో పాటుగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇందులో బాగుంది. యోగిబాబు ఇతర కమెడియన్స్ మంచి ఫన్ జెనరేట్ చేశారు. అలాగే నెగిటివ్ రోల్స్ లో శరద్ కేల్కర్(బాహుబలికి హిందీ డబ్బింగ్ చెప్పిన నటుడు) ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే ఇషా కోపిక్కర్ కూడా నెగిటివ్ రోల్ లో ఇంప్రెస్ చేసింది. వీటితో పాటుగా ఈ సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. మంచి సైఫై జానర్ కి తగ్గట్టుగా చాలా వరకు మెప్పించే ఫిక్షనల్ సీన్స్ ని డిజైన్ చేసుకున్నారు.

మైనస్ పాయింట్స్:

ఇదొక కొత్త ప్రయత్నం అయినప్పటికీ ఇందులో చాలా వరకు కథనం ఒకింత సింపుల్ గానే వెళ్ళిపోతుంది. ఇది వరకు చూసేసిన సినిమాల్లానే ఇదీ అనిపిస్తుంది. ఏలియన్ కాన్సెప్ట్ తో పాటుగా సూపర్ హీరో ఎలిమెంట్స్ కూడా ఇందులో యాడ్ చేశారు.

ఇవి కొంతమేర ఓకే అనిపించినా పూర్తి స్థాయిలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుగా అనిపించదు. అంతే కాకుండా చాలా వరకు సీన్స్ కొంచెం డ్రమాటిక్ గా సిల్లీగా వదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఫస్టాఫ్ లో మైంటైన్ చేసిన టెంపో సెకండాఫ్ లో కొద్దిగా మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది.

అలాగే క్లైమాక్స్ కి వచ్చేసరికి అది ఇంకొంచెం ఎక్కువ అయ్యింది. సో ఇలా పలు విజువల్స్ లో అక్కడక్కడా నాచురాలిటీ మిస్ అయ్యింది. ఇక వీటితో పాటుగా రెహమాన్ సంగీతం కూడా అప్ టు మార్క్ లెవెల్లో అనిపించలేదు.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని సీన్స్ లో విజువల్స్ పక్కన పెడితే మిగతా వరల్డ్ అంతా బాగా సెట్ చేశారు. ఇందులో దర్శకుడు విజన్ కనిపిస్తుంది. అలాగే టెక్నికల్ గా కూడా సినిమాని దాదాపు ఉన్న బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ నే ఇచ్చే ప్రయత్నం చేశారు. రెహమాన్ సంగీతం యావరేజ్ గా ఉంది. నీరవ్ షాహ్ కెమెరా వర్క్ బాగుంది. రూబెన్ ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా ఉంది.

ఇక దర్శకుడు ఆర్ రవికుమార్ విషయానికి వస్తే.. తాను దక్షిణాది నేటివిటీలో ఏలియన్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడం దానిని సాధ్యమైనంత వరకు బాగానే ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇందులో తన విజన్ బాగుంది. కానీ ఇందుకు తగ్గట్టుగా బలమైన కథనం, ఇంకా గ్రిప్పింగ్ గా మైంటైన్ చేసి ఉంటే బాగుండేది. ఇది పక్కన పెడితే తన ప్రయత్నంకి మాత్రం మంచి మార్కులు ఇవ్వొచ్చు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘అయలాన్’ చిత్రంలో మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్, ఒక కొత్త కాన్సెప్ట్ ని ఎక్స్ ప్లోర్ చేయాలనే ప్రయత్నం బాగుంది. ఇందులో కామెడీ, విజువల్స్ అలాగే లీడ్ నటుల పెర్ఫామెన్స్ లు మెప్పిస్తాయి. కానీ ఈ సబ్జెక్టుకి తగ్గట్టుగా ఇంకా బలమైన కథనం ఇందులో యాడ్ చేస్తే బాగుండేది. ఇది మినహా ఈ కొత్త ప్రయత్నం పిల్లలతో కలిసి ఒక్కసారికి అలా సరదాగా ట్రై చేయాలి అనుకుంటే ఆహా లో చూడొచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version