సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేర నీకెవ్వరు’ చిత్రం ఈ నెల 11న భారీ ఎత్తున విడుదలకానుంది. సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే 12న ‘అల వైకుంఠపురములో’ కూడా రిలీజ్ ఉండటంతో థియేటర్ల సంఖ్య కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి సినిమా చూడాలని ఉన్నా టికెట్లు దొరక్క ప్రేక్షకులు, అభిమానులు ఇబ్బందిపడే అవకాశం ఉంది.
అందుకే ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలకు అనుమతివ్వాలని సంభందిత అధికారుల్ని కోరారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఎప్ఫుడూ వేసే 4 షోలతో పాటు రాత్రి 1 నుండి ఉదయం 10 గంటల మధ్యలో అదనంగా ఇంకో రెండు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. ఈ వెసులుబాటు 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఉండనుంది. దీంతో మొదటి వారంపాటు రోజుకు 6 షోల చొప్పున మొత్తం మొదటి వారంలో ఒక్కో థియేటర్లో 42 షోలు నడవనున్నాయి. ఇది సినిమా వసూళ్లకు బాగా అనుకూలించే పరిణామం.
