ఈ ఏడాది 2025 మాత్రం తెలుగు సినిమాకి ఏమంత గొప్పగా సాగలేదు. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో వచ్చిన పలు భారీ సినిమాలు నిరాశపరిచాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’, జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2’ వంటి అవైటెడ్ చిత్రాలు ఈ ఏడాది అతిపెద్ద పరాజయాలుగా నిలిచాయి. కొన్ని సినిమాలు కాస్త మెరుగ్గా రాణించినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం నష్టాలను మిగిల్చాయి.
కొన్ని సినిమాల కలెక్షన్లు నంబర్స్ ప్రకారం భారీ లెవెల్లో కనిపించినప్పటికీ, ఏరియా వారీ వివరాలు చూస్తే పరిశ్రమ ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అనేది తెలుస్తుంది. అన్ని ప్రాంతాల్లో లాభాలను అందించిన చిత్రాలు వేళ్ల మీదనే లెక్కపెట్టవచ్చు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా రెండు చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టించి, 2025 టాలీవుడ్ ఊహించని విజయాలు గా నిలిచాయి.
కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ (Court: State vs. Nobody):
యువ నటీనటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ఆపాల ప్రధాన పాత్రల్లో ప్రియదర్శి పులికొండ, సాయి కుమార్ మరియు శివాజీ ఇందులో కీలక పాత్రలలో నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన సినిమా ఇది. మైనర్లపై అత్యాచారాలు చేసేవారిని కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో (POCSO) చట్టం దుర్వినియోగం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. అంతే కాకుండా చట్టం అనేది ప్రతీ ఒక్కరికీ తెలియాలి అనే మంచి సందేశాన్ని కూడా మేకర్స్ ఈ సినిమా ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు.
నిర్మాత, నాని కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ లు అందరి దృష్టి దీనిపై పడేలా చేసింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఒక అడుగు ముందుకేసి, “ఒకవేళ మీకు ‘కోర్ట్’ నచ్చకపోతే, నా ‘HIT 3’ సినిమా చూడకండి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత సినిమానే రిస్క్‌లో పెట్టేలా నాని చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది, సినిమాపై అవగాహన పెంచింది.
ప్రేమలో (Premalo) సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలవడం సినిమాకు కలిసొచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ రావడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా శివాజీ పోషించిన ‘మంగపతి’ పాత్ర చర్చనీయాంశంగా మారింది. డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ ఇంత సున్నితమైన అంశాన్ని అద్భుతంగా తెరకెక్కించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దే కాకుండా OTTలో కూడా మంచి సక్సెస్ సాధించింది.
లిటిల్ హార్ట్స్ (Little Hearts):
డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి ఈ సినిమా ఒక ఊహించని సక్సెస్ ని కొట్టి ట్రేడ్ సర్కిల్స్ ని షాక్ కి గురి చేసింది. యూట్యూబ్ ఫేమ్ మౌళి తనుజ్ ప్రశాంత్ హీరోగా హీరోయిన్ శివాని నగరం, మరియు దర్శకుడు సాయి మార్తాండ్ కెరీర్‌లను ఈ సినిమా మార్చేసింది.
కేవలం ₹2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ ఏకంగా ₹40 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నిర్మాతలకు ఈ సినిమా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ (ROI) ని అందించింది. ఫ్రెష్ కథనం, కొత్త నటీనటులు, స్వచ్ఛమైన కామెడీ, మరియు సింజిత్ ఎర్రమిల్లి సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. సినిమా ప్రమోషన్స్ కూడా వినూత్నంగా ఉండటం యువతను ఆకట్టుకుంది.
ETV Win లో విడుదలైన తర్వాత ఇతర భాషల ప్రేక్షకులు కూడా డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఈ సినిమా Netflix లో కూడా అందుబాటులోకి వచ్చింది. రాజీవ్ కనకాల, ఎస్.ఎస్. కాంచి, జై కృష్ణ మరియు నిఖిల్ అబ్బూరి ఇతర పాత్రల్లో నటించగా, ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని సపోర్ట్ చేశారు.
ఇలా ఈ రెండు సినిమాలతో పాటుగా కొత్తవారితో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కూడా ఒక సూపర్ సర్ప్రైజ్ హిట్ గా నిలిచింది. పెద్ద స్టార్స్ లేకపోయినా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రాలు నిరూపించాయి. మరిన్ని చిన్న సినిమాలు ఇలాగే విజయం సాధించి కొత్త టాలెంట్ కి మరింత ఆదరణ అందిస్తాయి అని ఆశిద్దాం.
