
‘అత్తారింటికి దారేదీ’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్, ‘రేసు గుర్రం’తో బంపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్‌తో కలిసి చేస్తున్న చిత్రం.. సన్నాఫ్ సత్యమూర్తి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన ‘జులాయి’ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే! ఇప్పుడదే కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్‌ని రిపీట్ చేసే పనిలో పడింది. ఈ చిత్రం ఆడియో వేడుకను ఈ నెల 15న నిర్వహిస్తున్నారు. అయితే.. అంతకంటే ముందుగానే సరికొత్త పంథాలో సినిమాను ప్రేక్షకుడికి చేరువ చేస్తున్నారు. మార్చి 6నుంచి మొదలుపెట్టిన ఈ కొత్త ప్రచార పంథా, ఆడియో రిలీజ్ వరకూ కొనసాగనుంది. మొదటి రోజు ప్రీ లుక్, రెండవ రోజు ఎక్స్టెండెడ్ ప్రీ లుక్, మూడో రోజు లోగో లుక్, నాలుగో రోజు మోషన్ పోస్టర్, ఐదో రోజు ఆడియో టీజర్, ఆ తర్వాత మూవీ టీజర్ అంటూ ఇలా రోజుకో కొత్త విషయాన్ని పరిచయం చేస్తూ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు.
తాజా సమాచారం మేరకు.. ఏప్రిల్ 2వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే, సెలవుదినం కావడం, ఆతర్వాత శని, ఆదివారాలను కలుపుకొని స్ట్రాంగ్ వీకెండ్ కలెక్షన్లపై కన్నేశారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ మరింత కలిసివచ్చే అంశం. సమంత, నిత్యామీనన్, అదా శర్మలు కథా నాయికలుగా నటిస్తున్నారు. ఎన్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, ఉంపేంద్రాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.