
తెలుగు తెరపై మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఒకప్పటి అందాల నటుడు శోభన్ బాబు వారసుడిగా, అయన మేనల్లుడు రాజబాబు హీరోగా పరిచయం కానున్నారు అనే వార్త అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ‘మేనల్లుడా.. మజాకా’ అనే టైటిల్ ఖరారు చేశారు. శోభన్ బాబు 79వ జన్మదినం సందర్భంగా రాజమండ్రిలో ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించారు. లవ్, కామెడీ, సెంటిమెంట్ అంశాల కలబోతగా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
శ్యామ్ అరుణ్ కడారి సమర్పణలో కేయస్ కంబైన్స్ పతాకంపై మల్లెల కిషోర్, పులి సంగీతరావు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సత్యనారాయణ దర్శకుడు. ఈ సినిమాలో మరో హీరోగా వెంకట్ యాదవ్ (‘నేను నేను రామునే’ ఫేం) నటిస్తున్నారు. హీరోయిన్, ఇతర టెక్నీషియన్లు తదితర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.