బాలీవుడ్ లో పీఆర్ వ్యవస్థ మరీ ఎక్కువైందని నటీనటులు కొన్ని రోజుల నుంచి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇదే అంశం పై శోభిత ధూళిపాళ్ల కామెంట్స్ చేశారు. ఇటీవలే ‘చీకటిలో’ అనే చిత్రంతో పలకరించిన శోభిత.. పీఆర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ముంబయికి చెందిన నటిని కూడా కాదు. వైజాగ్ నుంచి వచ్చి ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. నాకు పీఆర్ వ్యవస్థ సెట్ కాదు’ అని శోభిత చెప్పుకొచ్చారు.
శోభిత ధూళిపాళ్ల ఇంకా మాట్లాడుతూ.. ‘అందుకే నాకు మొదటి నుంచి పీఆర్ పై పెద్దగా ఆసక్తి లేదు. 24 గంటలూ అందరికీ కనిపిస్తూ ఉండాలి.. అందరూ నా గురించి మాట్లాడుకోవాలి అని నేను అనుకోను. పీఆర్ కల్చర్ కొంతమందికి పనిచేస్తుంది. కొందరికి సెట్ అవ్వదు. నా విషయానికి వస్తే.. నా సొంత విషయాలపై నాకు క్లారిటీ ఉంది. కాబట్టి, నాకు పీఆర్ అవసరం లేదు’ అని శోభిత ధూళిపాళ్ల అన్నారు.
