లాక్ డౌన్ సమయంలో ఎంతో మందికి సహాయం చేసి ఆదుకున్న నటుడు సోనూ సూద్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గాను దేశం మొత్తం ఆయన్ను మెచ్చుకుంది. సొంత ఆస్తులు తాకట్టు పెట్టి మరీ కోట్లకు కోట్లు ప్రజల కోసం వెచ్చించినందుకు సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ సోనూను కీర్తిస్తున్నారు. పలువురు సినీప్రముఖులు ఆయనకు సన్మాన సత్కారాలు కూడ చేశారు. ఆయన సహాయం అందుకున్న వారైతే సోనూ తమ పాలిట మెసయ్య అంటూ కొనియాడారు.
కానీ సోనూ సూద్ మాత్రం తాను దేవుడిని కానని తోటి మనిషికి సాయం మాత్రమే చేశానని అన్నారు. ఈ అభిప్రాయాన్ని చెప్పడానికే సోనూ ‘అయామ్ నో మెసయ్య’ పేరుతో పుస్తకం తీసుకొచ్చారు. సహరచయిత మీనా కె అయ్యర్ సహకారంతో ఈ తన ఆత్మకథకు పుస్తక రూపం ఇచ్చారు సోనూ. ఈ పుస్తకాన్ని ‘ఆచార్య’ మూవీ సెట్లో మెగాస్టార్ చిరుకు అందించారు సోనూ. ఈ సందర్బంగా చిరు సోనూకు అభినందనలు తెలుపుతూ ‘హీరోలు పుట్టారని, తయారుకాబడతారని నిరూపించావ్. ఎంతోమందికి సహాయం చేశావ్. నీ ప్రయాణం తప్పకుండా స్ఫూర్తినిస్తుంది’ అన్నారు చిరు. సోనూ కూడ చిరుకు కృతజ్ఞతలు చెబుతూ పుస్తకం చదివి మీరు ఇవ్వబోయే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తుంటానని చెప్పుకొచ్చారు.
