రివ్యూ: ‘స్పైడర్-మ్యాన్’ బ్రాండ్ న్యూ డే – హై-వోల్టేజ్ యాక్షన్… కానీ డ్రామాలోనే!

విడుదల తేదీ : జూలై 30, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : టామ్ హాల్యాండ్, జెండయా, సాడీ సింక్, మార్క్ రఫ్ఫాలో, జాన్ బర్న్థాల్, జాకబ్ బటలాన్ తదితరులు
దర్శకత్వం : డెస్టిన్ డేవిడ్ క్రెట్టన్
నిర్మాతలు : కెవిన్ ఫైగీ, అమీ పాస్కల్, అవి ఆరాడ్, రేచెల్ ఓ కానర్
సంగీతం : మైఖేల్ గియాచినో
ఛాయాగ్రహణం : బ్రెట్ పావ్లాక్
కూర్పు: నాట్ సాండర్స్, గినా శాన్సోమ్, హ్యారీ యూన్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజ్ ‘స్పైడర్-మ్యాన్’ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం.

కథ:

పీటర్ పార్కర్ అలియాస్ స్పైడర్ మ్యాన్ (టామ్ హాల్యాండ్) తన శరీరంలో ఊహించని మార్పులు గమనించి అయోమయానికి గురవుతాడు. అదే సమయంలో ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్’ (DDC) పై ఒక అదృశ్య టెలిపతి శక్తి దాడులు చేస్తూ V-MAX కోసం వెతుకుతుంది. ఇంతకీ DDC పై దాడి చేస్తున్న ఆ మిస్టరీ ఎటాకర్ ఎవరు? అసలు V-MAX అంటే ఏమిటి? దానిని కాపాడటానికి స్పైడర్ మ్యాన్ ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

స్పైడర్ మ్యాన్ చిత్రం అనగానే ప్రేక్షకులు భారీ యాక్షన్ బ్లాక్స్, ఆకట్టుకునే సూపర్ హీరో మూమెంట్స్ ఆశిస్తారు. ఆ విషయంలో మూవీ టీమ్ మంచి విజయం సాధించింది. సినిమా ప్రారంభ సన్నివేశాలు కథను సమర్థవంతంగా పరిచయం చేస్తూ, ముందుకు సాగేకొద్దీ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లకు దారితీస్తాయి.

ముఖ్యంగా ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలే ప్రధాన బలంగా నిలిచాయి. హల్క్‌తో స్పైడర్ మ్యాన్ తలపడే వార్ సీన్, అలాగే ‘ది హ్యాండ్’ తో సాగే స్టైలిష్ ఫైట్స్ విజువల్‌గా చాలా బాగున్నాయి. ఇవి ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

ఎమోషనల్ పాయింట్ అక్కడక్కడా సరిగ్గా వర్కౌట్ కాకపోయినా, కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ జీన్ గ్రే (సాడీ సింక్)తో స్పైడర్ మ్యాన్ తలపడే ఘట్టాలు ఆసక్తి కలిగిస్తాయి. ఎమ్జే (జెండయా)తో సాగే సంభాషణలు కథకు కాస్త ఉపశమనం ఇస్తాయి.

నటుడిగా టామ్ హాల్యాండ్ మరోసారి తన ప్రతిభను చాటుకున్నారు. హ్యూమర్, ఎమోషన్, యాక్షన్‌లను ఆయన సునాయాసంగా హ్యాండిల్ చేశారు. జెండయా స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే అయినా ఉన్నంతలో మెప్పించారు. జాన్ బర్న్థాల్, మార్క్ రఫ్ఫాలోలు తమ పాత్రల పరిధి మేర రాణించారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకి ప్రధాన బలహీనత స్క్రీన్‌ప్లే. చాలా చిన్న లైన్ చుట్టూ కథను అల్లుకోవడంతో, యాక్షన్ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు సాధారణంగా సాగుతాయి. కథనంలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడంతో ముందే ఊహించేలా సాగుతుంది.

రివేంజ్ యాంగిల్ ద్వారా ఎమోషనల్ కనెక్టివిటీ పెంచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు ఆ పాయింట్‌ను సరిగ్గా డెవలప్ చేయలేకపోయారు. దీనివల్ల సినిమాలో ప్రధాన ఘర్షణ బలంగా అనిపించదు. అలాగే కీలకమైన జీన్ గ్రే పాత్రలో సాడీ సింక్ నటన సాధారణంగా ఉండటంతో ఆ క్యారెక్టర్ ప్రభావం తగ్గింది.

కథలో కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లభించవు. DDC ఆ అదృశ్య శక్తి వెనక పడటానికి బలమైన కారణాలు చూపించలేకపోయారు. హల్క్ సబ్‌ప్లాట్ సరిగ్గా ముగింపుకు నోచుకోలేదు. అలాగే పనీషర్, బ్లాక్ విడో వంటి పాత్రలు కేవలం మార్వెల్ యూనివర్స్ విస్తరణ కోసమే పెట్టినట్లు అనిపిస్తాయి తప్ప, కథలో పెద్దగా ప్రభావం చూపవు. నెడ్ పాత్ర చేసిన జాకబ్ బటలాన్ కు కూడా ఆకట్టుకునే స్కోప్ దొరకలేదు.

సాంకేతిక వర్గం:

గతంలో ‘షాంగ్-చి’ చిత్రంతో అలరించిన దర్శకుడు డెస్టిన్ డేవిడ్ క్రెట్టన్, యాక్షన్ విషయంలో తన మార్కు చూపించినప్పటికీ కథనాన్ని నడిపించడంలో వెనుకబడ్డారు. యాక్షన్ సీన్స్ గ్రాండ్‌గా డిజైన్ చేసిన ఆయన, ఎమోషనల్ డెప్త్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.

బ్రెట్ పావ్లాక్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ప్లస్ పాయింట్. యాక్షన్ సీక్వెన్సులను కెమెరాలో స్టైలిష్‌గా బంధించారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) క్వాలిటీ బాగుంది. మైఖేల్ గియాచినో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు సరిపోయింది. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని నెమ్మదిగా సాగే సన్నివేశాలను ఎడిటింగ్ ద్వారా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. జ్యాకీ చాన్ స్టంట్ టీమ్ (Jackie Chan Stunt Team) అందించిన యాక్షన్ కొరియోగ్రఫీ ప్రత్యేకంగా మెప్పిస్తుంది.

తీర్పు:

‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అనేది యాక్షన్ ప్రియులను అలరించే ఒక సూపర్ హీరో ఎంటర్‌టైనర్. టామ్ హాల్యాండ్ నటన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అయితే ప్రిడిక్టబుల్ స్క్రీన్‌ప్లే, బలహీనమైన ఎమోషనల్ డ్రామా సినిమా స్థాయిని తగ్గించాయి. మార్వెల్ అభిమానులకు ఈ చిత్రం నచ్చే అవకాశం ఉంది, సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక పర్వాలేదనిపించే ఆప్షన్.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version