న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకి ముందు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మీడియాతో ముచ్చటించారు.
ఈ కథ పూర్తిగా కల్పితమా లేక నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారా?
ఇది రెండింటి కలయిక. నాని జడల లుక్ విషయానికి వస్తే, అది నా స్వంత అనుభవం ఆధారంగా తీసుకున్నదే. చిన్నతనంలో మా అమ్మకు కూతురు లేకపోవడంతో, నన్ను అమ్మాయిలా పెంచాలని నా జుట్టుకు జడలు వేసేది. ఇక ఈ చిత్రంలోని విప్లవ నేపథ్యం మాత్రం ఆదిలాబాద్‌లో జరిగిన ఒక యథార్థ సంఘటన నుండి స్ఫూర్తి పొంది రూపొందించాను.
’దసరా’ సినిమా విషయంలో మీరు ఎందుకు అసంతృప్తి చెందారు?
’దసరా’ సినిమా ద్వితీయార్థం చాలా క్లాసీగా ఉంటుంది. నాకు పోస్టర్ డిజైనింగ్ అంటే చాలా ఆసక్తి. మేము సినిమాను మార్కెట్ చేసిన విధానం చూసి చాలామంది ఇది ‘కెజిఎఫ్’ లాంటి ప్యూర్ మాస్ సినిమా అని భావించారు. కానీ సినిమాలో డ్రామా ఎక్కువ కావడంతో, కొందరు తాము ఆశించినదానికి భిన్నంగా ఉందని చెప్పారు. ఆ తర్వాతే ‘ది ప్యారడైజ్’ చిత్రంతో ప్రేక్షకులు కోరుకున్నది ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
’ది ప్యారడైజ్’ పూర్తిగా యాక్షన్ సినిమానేనా?
ఇది పూర్తిగా కమర్షియల్ యాక్షన్ సినిమా మాత్రమే కాదు. ఇందులో ఎమోషన్స్, సామాజిక అంశాలతో కూడిన అనేక విషయాల మిశ్రమం ఉంటుంది. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో యాక్షన్ కంటే ఎమోషన్సే ఎక్కువగా డామినేట్ చేస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ప్రేక్షకులు థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎమోషనల్ ఫీల్ వారి మనసులో బలంగా నిలిచిపోతుంది.
ట్రైలర్‌ను విడుదల చేయకపోవడం మంచి నిర్ణయమే అంటారా?
పాత రోజుల్లో మనం థియేటర్లో ఏం చూడబోతున్నామనే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రమోషన్స్ కల్చర్ మరియు వరుస అప్డేట్స్ కారణంగా ఆ అనుభూతి కరువైంది. నేను ఏ పని చేసినా మనసారా, పూర్తి నిబద్ధతతో చేయాలనుకుంటాను. అందుకే తొందరపడి ట్రైలర్ కట్ చేసే టైమ్ కూడా మాకు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడానికి కారణం ఏమిటి?
అది పూర్తిగా నా ప్లానింగ్ లోపమే. నాకు ఏదైనా ఒక సీన్ కచ్చితంగా అనుకున్న విధంగానే రావాలి అనుకుంటే, అది వచ్చే వరకు నేను వదిలిపెట్టను. నేను ఏ సీన్‌నీ రీషూట్ చేయలేదు కానీ, నటీనటులను మాత్రం బాగా ఇబ్బంది పెట్టాను; అది నిజమే. పర్ఫెక్షన్ కోసం వంద టేక్స్ తీసుకోవడానికైనా నేను వెనుకాడను. అందుకే షెడ్యూల్స్ అనుకున్న దానికంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి, నటుల డేట్స్ సర్దుబాటు చేయడం కూడా కష్టమైంది.
నానిగారిని ఆ జడల లుక్ కోసం ఎలా ఒప్పించగలిగారు?
నేను నాని అన్నకు ఈ రెండు జడల లుక్ గురించి చెప్పగానే, ఆయన వెంటనే ఓకే చెప్పారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వద్దని వారించారు, చివరికి నా టీమ్‌లోని వాళ్ళు కూడా సందేహాలు వ్యక్తం చేశారు. కానీ నేను దానిని బలంగా నమ్మాను. ఆ జడల వెనుక ఒక బలమైన ఎమోషనల్ టచ్ ఉంది.
ఈ సినిమాలో మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయి? దీనికి సీక్వెల్ ఉంటుందా?
బిట్ సాంగ్స్‌తో కలుపుకుని మొత్తం ఆరు పాటలు ఉంటాయి. అనిరుధ్‌తో పనిచేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది, మన మనసులోని ప్రతి విషయాన్ని ఆయనతో బహిరంగంగా పంచుకోవచ్చు. ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఎటువంటి సీక్వెల్ లేదు. ఇది ఒకే పార్ట్‌గా ముగిసే పూర్తి సినిమా.
