
బలమైన సోషల్ మెసేజ్ ఉన్న కథ., కానీ దాన్ని కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చేసిన దర్శకుడిని నమ్మి ఓ స్టార్ హీరో సినిమా చేయడం టాలీవుడ్ లో చాలా చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి కథని, దర్శకుడైన కొరటాల శివని నమ్మి సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన సినిమా ‘శ్రీమంతుడు’. మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యి మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం మొదలెట్టింది. మొదటి రెండు వారాల్లో 60 కోట్ల మార్క్ ని క్రాస్ చేయనున్న ఈ సినిమా సక్సెస్ విషయంలో ఈ చిత్ర టీం చాలా హ్యాపీగా ఉన్నారు.
ఇప్పటికే తెలుగులో, ఓవర్సీస్ లో కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టించిన శ్రీమంతుడు సినిమా లేటెస్ట్ గా తమిళంలో అరుదైన రికార్డ్ ని బ్రేక్ చేసింది. తమిళనాడు ట్రేడ్ రిపోర్ట్స్ చెప్పిన సమాచారం ప్రకారం తమిళనాడులో ‘శ్రీమంతుడు’ తెలుగు వెర్షన్ 11 రోజుల్లో 1 కోటి మార్క్ ని క్రాస్ చేసింది. ఇక్కడ విషయం ఏమిటంటే శ్రీమంతుడు సినిమాని డబ్ చేసి తమిళ వెర్షన్ ని కూడా ఒకేసారి రిలీజ్ చేసారు. తమిళ వెర్షన్ ఉన్నప్పటికీ తెలుగు వెర్షన్ 1 కోటి పైన కలెక్ట్ చెయ్యడం రికార్డ్ అని అంటున్నారు. ఒక తెలుగు సినిమాకి తమిళనాడులో ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం ఇదే ప్రధమం అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు బాక్స్ ఆఫీసు వద్ద కూడా మహేష్ బాబు శ్రీమంతుడు’తో మరో రికార్డ్ ని సృష్టించాడు.
శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు.