
సూపర్ స్టార్ మహేష్ హీరోగా, ‘మిర్చి’తో సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా శ్రీమంతుడు. ప్రపంచవ్యాప్తంగా గత శుక్రవారం భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా, అన్నిచోట్లా సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఊరిని దత్తత తీసుకొని బాగుపరిచే ఓ శ్రీమంతుడి కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఓ సోషల్ మెసేజ్ ఉన్న కథాంశానికి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించిన విధానానికి అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక భారత ప్రధాని కాన్సెప్ట్ అయిన ఊరిని దత్తత తీసుకొని అభివృద్ధి పరచడమనే అంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో రాజకీయ వర్గాల్లోనూ శ్రీమంతుడుపై మంచి ఆసక్తి కనిపించింది. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా శ్రీమంతుడుపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే! ఇక ఈ నేపథ్యంలోనే సినిమాను మరింత ఎక్కువ మంది ప్రముఖులకు దగ్గర చేయాలన్న ఉద్దేశంలో కొన్ని స్పెషల్ షోస్ వేసే దిశగా శ్రీమంతుడు టీమ్ ఆలోచిస్తోంది.
ఇదే విషయమై దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. “మంచి సోషల్ మెసేజ్ ఉన్న ఈ సినిమాను అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాను ఇంకా ఎక్కువమంది ప్రముఖులకు చేర్చాలన్న ఆలోచనైతే ఉంది. త్వరలోనే పలువురు రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులకు స్పెషల్ షోస్ వేయాలని అనుకుంటున్నాం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపడతాం” అని తెలిపారు.