‘శ్రీమంతుడు’ ప్రమోషనల్ స్ట్రాటజీ..!

Mahesh-srimantudu
మహేష్ అభిమానులు పండగ చేస్కునే నెల దగ్గర పడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఈనెల 18న జరగనున్న విషయం తెలిసిందే! ఇక వచ్చే నెల 7న భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందు, సినిమాపై అంచనాలు పెంచేయడానికి వినూత్న ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం చాలా ఉన్న నేపథ్యంలో శ్రీమంతుడు ఆ తరహా ప్రచారాలను మొదలుపెట్టేసింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఒక అవగాహనను కల్పించగా ఆడియో రిలీజ్ వరకూ మహేష్ పోస్టర్లు కొన్ని రిలీజ్ చేసే పనిలో సినిమా యూనిట్ ఉంది. ఈ క్రమంలోనే విడుదలైన మహేష్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆడియో రిలీజ్ తర్వాత ఒక్కో క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఒక్కోరోజు విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. తెలుగు సినిమాల్లో ఈ తరహా ప్రమోషన్‌కు తెరలేపింది ‘బాహుబలి’ సినిమాయే అని చెప్పాలి. ఈ ప్రమోషన్లే ఆ సినిమాకు రిలీజ్ సమయంలో విపరీతమైన హైప్ తెచ్చిపెట్టాయ్!

హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో 18న జరగనున్న ఆడియో ఆవిష్కరణ వేడుకను కూడా వినూత్నంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా అదే రోజు విడుదల చేయనున్నారు. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

Exit mobile version