
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటినుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్, కర్ణాటక.. ఇలా అన్ని చోట్లా ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ భారీ కలెక్షన్స్ సాధించింది. ఇక మహేష్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉండే అమెరికాలో కూడా ఈ సినిమా సత్తా చాటుతూ దూసుకుపోతోంది. మొదటి వారాంతం ముగిసే సరికి బాహుబలి తర్వాత స్థానంలో నిలబడి శ్రీమంతుడు యూఎస్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అమెరికాలో గురువారం ప్రీమియర్ షోలతోనే సుమారు 550కే డాలర్స్ వసూలు చేసిన ఈ సినిమా ఆదివారం ముగిసేసరికి 2 మిలియన్ డాలర్స్ కొల్లగొట్టి అత్తారింటికి దారేదీ లైఫ్ టైమ్ రికార్డును దాటేసింది. ఇక ఫస్ట్ వీకెండ్ మొత్తం కలిపి చూస్తే 2.06 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి శ్రీమంతుడు నిజమైన శ్రీమంతుడుగా నిలిచింది. ఇక ఈ మొత్తాన్ని ఇండియన్ రూపాయల్లో లెక్కేస్తే 13.18 కోట్ల రూపాయలుగా తేలుతోంది. లాంగ్ రన్‌లో శ్రీమంతుడు అమెరికాలో 3 మిలియన్ వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా. మైత్రీ మూవీస్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించారు.