రాజమౌళి క్లాప్, పురాణపండ కెమెరా స్విచ్ ఆన్ తో సాయి కొర్రపాటి నిర్మిస్తున్న కీరవాణి కుమారుడి సినిమా

rajamouli , puranapanda srinivas

ఒక్కో సినిమా ప్రారంభం అయినప్పుడు …. ఆ విశేషాల్ని ప్రత్యేకంగా ముచ్చటించుకోవాలి. . కొన్ని సందర్భాలు అలాంటివే ఉంటాయి. ఈ భారతదేశం సగర్వంగా చెప్పుకునే ఎస్.ఎస్.రాజమౌళి హాజరయ్యే ప్రతీ సినిమా ఫంక్షన్ పై మీడియా ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుంది. ఇందుకు అతని విలువైన సినిమా జీవన ప్రయాణమే కారణం. వెండితెరకు ఘన విజయాలు అందించి ఇతర దేశాలు చెప్పుకునేలా చేసిన రాజమౌళి సృజనాత్మకత గురించి వేరే చెప్పాల్సిన పని లేదు.

రాజమౌళికి ఇష్టమైన సన్నిహితుడెవరయ్యా అంటే వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈగ లాంటి అసాధారణ సినిమా నిర్మించి జాతీయ పురస్కారం అందుకున్న నిర్మాత సాయి కొర్రపాటి అని ఠక్కున చెప్పేస్తారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి తెలుసున్న ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా తెలుసు. తన ట్విట్టర్ ఖాతాలో .. తనకున్న ఆత్మబంధువైన స్నేహితుడు సాయి కొర్రపాటి అని రాజమౌళి స్వయంగా చెప్పారు కూడా.

చాలా విరామం తరువాత సాయి కొర్రపాటి ప్రొడక్షన్ బ్యానర్ పై రజని కొర్రపాటి , రవీంద్ర బెనర్జీ నిర్మాణ సారధ్యంలో క్రొత్త దర్శకుడు మణికంఠ జెల్లీ దర్శకత్వంతో విజయదశమి సాయంకాలం ప్రత్యేకంగా ఏర్పాటైన కార్యక్రమంలో వారాహి చలన చిత్రం మరియు లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఒక నూతన చిత్రానికి శ్రీకారం చుట్టాయి.

ఇంతకీ ఇందులో హీరో ఎవరంటే రాజమౌళి పెద్దన్న కుమారుడు సింహా. అంటే … ప్రఖ్యాత సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణి రెండో కుమారుడన్నమాట. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఇప్పటికే సంగీత దర్శకుడిగా అదరగొడుతున్నారు. రెండో కొడుకు సింహా తన మొదటి చిత్రం ‘ మత్తు వదలరా ‘ లో హీరోగా తన సత్తా చూపించారు. కరోనా లాక్ డౌన్ లో కూడా ‘ మత్తు వదలరా’ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుని ఇటుకాలభైరవకి, అటు సింహాకి మంచి పేరు సంపాదించి పెట్టింది. నో డౌట్.

దర్శకధీరుడు రాజమౌళి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై ముహూర్తానికి క్లాప్ కొట్టి సాయి కొర్రపాటికి , చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. రాజమౌళి, సాయి కొర్రపాటికి మరొక ఆత్మీయ స్నేహితులైన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మరొక ప్రత్యేక అతిధిగా హాజరై ఈ చిత్రానికి కెమెరా స్విచ్ ఆన్ చెయ్యడం మరొక విశేషం .

పురాణపండ శ్రీనివాస్ అనగానే వందల కొలది దేవాలయాలలో, పూజా పీఠాలలో , మఠాలలో వేలకొలది భక్తగణం ప్రార్ధించే, స్తోత్రించే , కథాకథన సంవిధానాల అపురూప దైవ గ్రంధాలు మన కన్నుల ముందు దర్శనమిస్తాయి. తెలుగునాట పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంధాలను పఠించే వారు లక్షల్లో వున్నారు. ఇటీవల ఆంజనేయస్వామిపై పురాణపండ శ్రీనివాస్ అమోఘంగా, రసభరితంగా రచించిన మహా గ్రంధాన్ని భారత హోమ్ శాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి పురాణపండను ప్రశంసించడం , ఈ ఘట్టానికి సాయి కొర్రపాటి హాజరై అమిత్ షా దృష్టిని ఆకర్షించడం ఒక అద్భుతమైన యాదృచ్చిక సంఘటన.

ఇలాంటి పవిత్ర గ్రంధాల రచయిత వినయ విధేయతలతో తన సన్నిహితుల అపురూప కార్యక్రమానికి హాజరవ్వడాన్ని ప్రత్యేకంగా సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. సర్వ సాధారణంగా పురాణపండ శ్రీనివాస్ ఏ కార్యక్రమానికి, ఎటువంటి సభకు హాజరవ్వడం పట్ల ఆసక్తి చూపరని సాహితీ, ఆధ్యాత్మిక మిత్రులకూ ఎరుకే. తిరుమల దర్శనంలో వున్న పురాణపండ శ్రీనివాస్ శ్రీవారి దర్శనమైన వెంటనే తన సన్నిహితుల నూతన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా హాజరవ్వడం గమనార్హం. ఈ ఫోటోలో గుండుతో వున్న వ్యక్తే ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ . తిరుమల మొక్కు తీర్చుకున్న వెంటనే శ్రీనివాస్ ఈ క్రొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంలో విఖ్యాత సంగీత దర్శకుడు కీరవాణి , కీరవాణి శ్రీమతి శ్రీవల్లి , రాజమౌళి శ్రీమతి అయిన రమా రాజమౌళి తదితర ప్రముఖులు పురాణపండ శ్రీనివాస్ తో కాస్సేపు ముచ్చటించారు. ఆ సందర్భంలో ఫోటోలు ఇవి.

తన రెండవ కుమారుడైన సింహా కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి తన మొదటి కుమారుడు కాలభైరవ సంగీత దర్శకత్వం వహించడం తండ్రిగా కీరవాణికి ఎంతో సంతోషించే విషయం . దైవఘటనగా ఈ చిత్రం స్క్రిప్ట్ ప్రతిని కీరవాణి చేతులతో అందుకున్న దర్శకుడు మణికంఠ అదృష్ట వంతుడు.

ఎన్నో ఘన విజయాల్ని చూసిన సాయికొర్రపాటికి ఇటీవల సరైన విజయాలు లేవు. అయితే వారాహి చలన చిత్రమ్ బ్యానర్ పై నిర్మించిన కె.జి.ఎఫ్. అనువాద తెలుగు చిత్రం మాత్రం సాయి కొర్రపాటికి తెలుగు రాష్ట్రాలలో ఘన విజయంతో పాటు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. చాలా కాలం తర్వాత ఒక నూతన దర్శకుడికి అవకాశమిచ్చి , తానెంతో ఇష్టపడే కీరవాణి గారి అబ్బాయిలతో చేస్తున్న ఈ క్రొత్త చిత్రమ్ ను దర్శకుడిలా తీర్చి దిద్దుతాడో వేచి చూద్దాం.

విజయదశమి పండుగ నాడు ముహూర్తపు షాట్ తో ప్రారంభమవ్వడం వల్ల వారాహి చలన చిత్రమ్, లౌక్య ఎంటర్టైన్ వారికి కాసులు కురిపించాలని కోరుకోవడం తప్పుకాదేమో ?! తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన వక్తగా పేరొందిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ చిత్ర సుముహూర్తానికి ఎస్. ఎస్. రాజమౌళితో కలిసి పాల్గొనడం గమనార్హం.

Exit mobile version