వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన అలీ!

Ali
వెండితెరపై ఎన్నో ఏళ్ళుగా నవ్వుల పూలు పూయిస్తున్న హాస్యనటుడు అలీ, అదే స్థాయిలో బుల్లితెరపైన, పలు సినీ వేడుకల్లోనూ తనదైన స్టైల్‌తో యాంకర్‌గానూ మెప్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. కాగా గత కొద్దికాలంగా అలీ హోస్ట్‌గా నిర్వహిస్తోన్న షోలు, వేడుకల్లో డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్యత ఎక్కువైందనే టాక్ బాగా వినబడుతోంది. తాజాగా అనుష్క అందాన్ని పొగుడుతూ ‘సైజ్ జీరో’ ఆడియో ఫంక్షన్‌లో అలీ చేసిన కామెంట్స్ అంతటా పెద్ద దుమారమే రేపాయి. ఈ కామెంట్స్‌పై పలు సోషల్ సైట్స్‌లో అలీని విమర్శిస్తూ నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఈ కామెంట్స్‌పై అలీ అందరినీ సమాధాన పరిచే ప్రయత్నం చేశారు. అనుష్కపై అభిమానంతో, తన అందాన్ని మాత్రమే పొగిడానని, వేరే ఇతర ఏ ఉద్దేశాన్ని ఆపాదిస్తూ ఆ కామెంట్స్ చేయలేదని చెప్పుకొచ్చారు. హీరోయిన్ అందాన్ని పొగడడంలో తప్పులేదనుకుంటానని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక “నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లైతే వారందరికీ ఈ సందర్భంగా క్షమాపణలు తెలుపుకుంటున్నా. ఇకపై ఇలాంటి కామెంట్స్ రాకుండా జాగ్రత్తపడతా” అని స్పష్టం చేశారు.

Exit mobile version