‘కుమారి 21 ఎఫ్‌’కు స్టార్ హీరోల సపోర్ట్!

kumari-21-f
‘కుమారి 21 ఎఫ్’.. ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి ‘సుకుమార్ రైటింగ్స్’ అన్న బ్యానర్‌పై రూపొందించిన క్యూట్ లవ్‌స్టోరీ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈనెల 31 పెద్ద ఎత్తున జరగనుంది. ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాకరు కానుండడం విశేషం. ఇక గత కొద్దికాలం వరకూ ఎక్కడా పెద్దగా ప్రస్తావనకు కూడా రాని ఈ సినిమా, టీజర్ లాంచ్ తర్వాత అంతటా వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా ఈ సినిమా టీజర్‌ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసి టీజర్‍ను రిలీజ్ చేయడంతో ‘కుమారి 21ఎఫ్’పై అంతటా ఆసక్తి మొదలైంది. ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో కుమారి 21 ఎఫ్ టీమ్‌కు విషెస్ చెప్పడంతో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆడియో రిలీజ్ కానుండడంతో ఈ సినిమా మళ్ళీ అంతటా క్రేజీగా మారిపోతుందనడంలో సందేహం లేదు.

సుకుమార్ నిర్మాతగా మారి చేస్తోన్న తొలి ప్రయత్నానికి ఆయన దర్శకత్వంలో నటించిన స్టార్ హీరోలంతా ఇలా సినిమాకు సపోర్ట్‌గా నిలుస్తూ ఉండడం విశేషం. అల్లు అర్జున్‌కి ‘ఆర్య’, ‘ఆర్య 2’ లాంటి డిఫరెంట్ సినిమాలు, మహేష్‌కి ‘1 నేనొక్కడినే’ లాంటి ప్రయోగాత్మక సినిమా, ఎన్టీఆర్‌కు స్టైలిష్ రివెంజ్ డ్రామా.. ఇలా ప్రతీ హీరోకు ఓ కొత్త గుర్తింపునిస్తూ వస్తోన్న సుకుమార్ విలక్షణతే ఆయన హీరోలు తన సినిమాకు సపోర్ట్‌గా నిలవడంలో ప్రధానంగా కనిపిస్తోన్న అంశం. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాలో రాజ్ తరుణ్, హీబా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Exit mobile version