
‘అరుంధతి’, ‘అతడు’, ‘దూకుడు’, ‘జులాయి’ లాంటి సినిమాలతో తెలుగులో విలన్‌గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు సోనూసూధ్. తాజాగా ప్రఖ్యాత యాక్షన్ సూపర్ స్టార్ జాకీచాన్ సినిమాలో సోనూ సూధ్ ఓ కీలక పాత్ర పోషించనుండడం విశేషంగా మారిపోయింది. తనదైన మార్క్ యాక్షన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన స్టార్ అయిన జాకీచాన్, ప్రస్తుతం కుంగ్‌ఫూ యోగా పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. జాకీచాన్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సోనూసూద్‌ను ఓ కీలక పాత్రకు ఎంపిక చేశారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. దుబాయ్‌లో జరుగుతోన్న ఈ షెడ్యూల్లో తాజాగా సోనూ సూధ్ జాయిన్ అయ్యారు. జాకీచాన్‌తో సరి సమానమైన పాత్రగా సోనూసూధ్ పాత్ర ఉండనుందని సమాచారం. చైనా, ఇండియాలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు స్టాన్లీ టాంగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాకీచాన్ సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా సోనూసూధ్కు తెలుగు, హిందీ స్టార్స్ నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.