
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘రేయ్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో సాయిధరమ్ తేజ్. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర రెండవ సారి ఈ సినిమాలో జోడీ కట్టారు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సాయిధరమ్ తేజ్ కి మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజునే ఈ సినిమాని కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించాడు. ఈ సినిమాని సెప్టెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు.
సినిమా రిలీజ్ తో పాటు ఆడియోని కూడా స్పెషల్ డే రోజున విడుదల చేయాలని అనుకొని మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే కానుకగా ఈ సినిమా ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలనుకున్నారు. కానీ మాకు అందిన తాజా సమాచారం ప్రకారం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగష్టు 22న ఆడియో రిలీజ్ కావట్లేదు. ఒక్కరోజు ముందుకు వెళ్లి ఆగష్టు 23న గ్రాండ్ గా హైదరాబాద్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేయనున్నారు. అమెరికాలో షూట్ చేసిన మెయిన్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన స్పెషల్ ఆడియో రిలీజ్ టీజర్ కి వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్ తో సినిమాపై హైప్ పెరిగింది. పూర్తి కమర్షియల్ హంగులతో రానున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.