శివకుమార్ రామచంద్రవరపు, డిబోరా డోరిస్ ఫెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “సువర్ణ టెక్స్టైల్స్”. ప్రశాంత్ నామిని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. రాజశేఖర్ అనింగి, విక్రమాదిత్య డాంబర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది.
ఏ.వై.వి. ప్రొడక్షన్స్ మరియు సనాతన క్రియేషన్స్ పతాకాలపై అనిల్ ఈరుగుదిండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను కేవలం రెండు షెడ్యూళ్లలోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. యువతను ఆకట్టుకునేలా అడల్ట్ కామెడీని జోడించి ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
ప్రస్తుతం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ ఏడాది ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
