రేపట్నుంచి తమిళ సినిమాల షూటింగ్‌ బంద్..!

kalai-puli
తమిళ సినీ పరిశ్రమ నిర్మాతల మండలి (TFPC), సౌతిండియా ఫిల్మ్ ఎంప్లాయి ఫెడరేషన్‌ (FEFSI)ల మధ్యన జీతం పెంపుకు సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమిళ సినీ నిర్మాతల మండలి రేపట్నుంచి (జూలై 27) సినిమా షూటింగ్‌లను బంద్ చేయనుంది. ఇదే విషయమై నిర్మాతల మండలి నిన్న చెన్నైలో ఓ ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసి జీతం పెంపుకు సంబంధించి ఇంతకుముందు జరిగిన చర్చలు, తాము షూటింగ్ బంద్ చేయాలని తీసుకున్న నిర్ణయం తదితర వివరాలను వెల్లడించారు.

దక్షిణ భారత సినీ కార్మిక సంఘం ఈ మధ్యే జీతం పెంపు విషయమై ఓ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సినీ నిర్మాతలకు నష్టం చేకూరుస్తుందన్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా బంద్ ప్రకటించినట్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలిపింది. ఇక ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు కలైపులి థాను ఇదే విషయమై మాట్లాడుతూ.. “మాకు ఇప్పటివరకూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎంప్లాయి ఫెడరేషన్ జీతం పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఇది ఇప్పటికే సెట్స్‌పై ఉన్న చాలా చిన్న సినిమాలకు తీరని నష్టం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే జూలై 27 నుంచి సినిమా షూటింగ్‌లను బంద్ చేయనున్నాం” అని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఎంప్లాయి ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. త్వరలోనే తమకు, నిర్మాతలకు మధ్యన వచ్చిన ఈ గొడవ సమసిపోతుందని, నిర్మాతల మండలి కూడా బంద్‌ను త్వరలోనే విరమించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version