
దర్శకుడు తేజ అంటే తెలుగు సినిమాలో ఓ బ్రాండ్. తనదైన బ్రాండ్‌తో సినీ పరిశ్రమకు ‘చిత్రం’, ‘జయం’, ‘నువ్వు నేను’ లాంటి పలు బ్లాక్ బస్టర్ విజయాలను అందించిన ఘనతను సొంతం చేసుకున్న తేజ, ఈ మధ్య కాలంలో తనదైన హిట్ కొట్టలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ తన మార్క్ చూపెట్టి మంచి హిట్ కిట్టి తీరతారన్న నేపథ్యంలో ‘హోరా హోరీ’ అనే సినిమా విడుదలకు సిద్ధమైంది. రేపు తేజ దర్శకత్వంలో రూపొందగా దక్ష, దిలీప్‌లను పరిచయం చేస్తూ రూపొందిన హోరా హోరీ విడుదల కానుంది.
ఈ సందర్భంగా తేజ తన సూపర్ హిట్ సినిమా ‘చిత్రం’ గురించి ప్రస్తావిస్తూ.. చిత్రం సినిమాకు సీక్వెల్ రూపొందించే ఆలోచన ఎప్పట్నుంచో ఉందని తెలియజేశారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమైందని, తన అసిస్టెంట్ దర్శకత్వంలో తేజ ఆ సినిమాను స్వయంగా నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అప్పట్లో ట్రెండ్ సృష్టించిన చిత్రం సినిమాకు సీక్వెల్ అంటే అది ఎంత క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందో ఊహించుకోవచ్చు. ఇక హోరా హోరీ విషయానికి వస్తే.. కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూర్చారు.

