
సినిమా సినిమాకి కొత్తహీరోలని , హీరోయిన్స్ ని పరిచయం చేయడం వారికి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చి పెట్టిన డైరెక్టర్ తేజ. కొత్త వారితోనే కాదు ఆయన చేసే ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపుతూ ట్రెండ్ సెట్ చేసిన తేజ ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకోలేకపోయాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకున్న తేజ ‘హోరా హోరీ’ అనే సినిమాని మొదలు పెట్టాడు. ఈ సినిమాని మొదలు పెట్టడంతోనే వార్తల్లో నిలిచాడు. అదేమిటంటే ఈ సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ ని తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి ఎంచుకోవడం.
దాంతో ఈ సినిమా షూటింగ్ కి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల వల్లే నిన్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ఒక్క ఏపి ఫిల్మ్ ఎంప్లాయిని కూడా తీసుకోలేదని ఏపి ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి 20 మంది వచ్చి సినిమా షూటింగ్ ని నిలిపివేశారు. దాంతో తేజ లోకల్ పోలీసులకి న్యూసెన్స్ అని కేసు పెడితే వారు వచ్చి ఆ 20 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. వారందరూ మళ్ళీ గొడవ చెయ్యము అని మాట ఇచ్చాక పోలీసులు వారిని వదిలేసారు. ప్రస్తుతం అంతా సెటిల్ అవ్వడంతో షూటింగ్ జరుగుతోంది.