మెగాస్టార్ చిరంజీవి నివాసానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఎగ్జిబిటర్లు, నిర్మాతల బృందం చేరుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్ బాబు, ప్రముఖ నిర్మాతలు కె.ఎల్. నారాయణ, దిల్ రాజు, సునీల్ నారంగ్‌లతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు జువ్వాడి శేఖర్, ఎగ్జిబిటర్లు శ్రీధర్, అనుపమ్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, బాల గోవింద్ రాజు తదితరులు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వాహకులు ఎదుర్కొంటున్న వివిధ ఆర్థిక, సాంకేతిక సమస్యలను మెగాస్టార్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ భేటీ ఏర్పాటయింది. ముఖ్యంగా థియేటర్ల పర్సంటేజ్ సిస్టమ్, నిర్వహణ ఖర్చులు, ఇతర కీలక సమస్యలపై వారు చిరంజీవితో చర్చించనున్నారు.
పరిశ్రమలో పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవిని కలిసి తమ ఇబ్బందులను వివరించడం ద్వారా, ప్రభుత్వాల దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి తగిన పరిష్కారం కనుగొనవచ్చని ఎగ్జిబిటర్ల బృందం భావిస్తోంది. సింగిల్ స్క్రీన్స్ మనుగడకు సంబంధించిన ఈ సమావేశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
