‘గద్దర్’ అవార్డులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

dilraju

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘గద్దర్’ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవార్డుల ప్రక్రియ కోసం విధి విధానాలను ఖరారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట పురస్కారాలు ఇవ్వనున్నారు.

మార్చి 13 నుంచి ఈ అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం ఉగాదికి కొంచెం అటు ఇటు కావచ్చని.. వచ్చే ఏడాది నుంచి ఉగాది రోజునే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2013 నుంచి గత ప్రభుత్వం సినిమా అవార్డులు ఇవ్వనందున వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఒక్కో ఏడాదికి ఒక్కో ఉత్తమ చిత్రానికి పురస్కారం ఇవ్వనున్నారు.

2024వ సంవత్సరానికి నటీనటులు సాంకేతిక నిపుణుల వ్యక్తిగత అవార్డులతో పాటు ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, బాలల చిత్రం, జాతీయ సమైక్యత చిత్రం, పర్యావరణం, చారిత్రక సంపద తదితర విభాగాల సినిమాలకు గద్దర్ అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు తొలి ఫీచర్ ఫిల్మ్, సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, యానిమేషన్ ఫిల్మ్ విభాగాల్లోను పురస్కారాలు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. తెలుగు సినిమా పై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలు రాసే ఫిల్మ్ జర్నలిస్టులకు కూడా అవార్డులు ఇస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు.

Exit mobile version