సోషల్ మీడియాలో తెలుగు సినిమా హవా..!

baahubali-srimanthudu

ఓ సినిమాకున్న క్రేజ్ ఏంటో తెలియజెప్పడానికి ఇప్పుడున్న ఆప్షన్‌లలో ఒకటి సోషల్ మీడియా. ఏ సినిమా ట్విట్టర్‌లో ఎక్కువ ట్రెండ్ అవుతోంది? ఫేస్‌బుక్‌లో ఏ సినిమా పేజ్‌కి ఎక్కువ లైకులున్నాయ్? యూట్యూబ్‌లో ఏ సినిమా ట్రైలర్‌కి వ్యూస్ ఎక్కువ ఉన్నాయ్? ఇవన్నీ సాధారణంగానే సినిమా విడుదలకు ముందు ఆ సినిమాకున్న క్రేజ్‌ను పసిగట్టడానికి ఉపయోగపడే అంశాలు. తాజాగా ఈ విషయంలో తెలుగు సినిమాలు తమ సత్తా చాటుతూ దేశవ్యాప్తంగా తెలుగు సినిమాకున్న క్రేజ్‌ను బయటపెడుతున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒక్క బాలీవుడ్ సినిమా చేయకున్నా దేశవ్యాప్తంగా పాపులరిటీ సంపాదించుకున్నారు మహేష్. మహేష్ సినిమా వస్తుందంటే చాలు.. ఆ సినిమా పట్ల జాతీయ మీడియా కూడా ఆసక్తి కనబరుస్తుంది. తాజాగా మహేష్ నటిస్తోన్న ‘శ్రీమంతుడు’ ఫస్ట్‌లుక్ టీజర్ మే 31న విడుదలైన విషయం తెలిసిందే! ఈ టీజర్ విడుదల అయిన ఒక్క రోజులోనే 1 మిలియన్ వ్యూస్ సాధించి మహేష్ స్టామినా ఏంటో నిరూపించింది. ఇక ఈ సినిమాకు ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. టీజర్ అయిన రోజు శ్రీమంతుడు ఈ రెండు సోషల్ సైట్లలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది.

ఇక దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఈ సినిమా కోసం యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాహుబలికి సంబంధించిన కొత్త పోస్టర్ గానీ, సమాచారం గానీ ఏది విడుదలైన అది సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలవడం సహజంగా మారిపోయింది. ఇక ఈ మధ్యే విడుదల చేసిన టీజర్, ట్రైలర్‌లైతే యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. బాహుబలి హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లోని ట్రైలర్‌లు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌గా నిలిచాయి.

భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు పరిశ్రమకు ఓ ప్రత్యేక స్థానమున్నా, కొంత చిన్నచూపు కూడా ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాలు ఇలా దేశవ్యాప్తంగా తమ సత్తా చాటుకుంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలవడం తెలుగు సినిమాలకు ఒక క్రేజ్‌ను తెచ్చిపెడుతున్నాయి. ఆ క్రేజ్‌ను సరిగ్గా వాడుకొని, తెలుగులో బలమైన కథాంశాలను తెరకెక్కిస్తే.. తెలుగు సినిమా వైభవాన్ని ఎవ్వరూ ఆపలేరదన్నది సత్యం. ఆ దిశగానే తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా తమ ప్రత్యేకతను చాటుకోవాలని కోరుకుందాం.

Exit mobile version