
గత నెలలో ‘బాహుబలి’ విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచనాలు నమోదు చేసింది. ఈనెల ఆ జోరును అందిపుచ్చుకొని బాక్సాఫీస్ వద్ద ‘శ్రీమంతుడు’ సినిమా దూసుకుపోయింది. ఈ రెండు సినిమాలు సాధించిన విజయాలతో తెలుగు సినిమాకు దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ కోవలో మరో మూడు రోజుల్లో విడుదల కానున్న ‘కిక్ 2’పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రవితేజ కెరీర్లో మరచిపోలేని సినిమాగా నిలిచిన ‘కిక్’కు రీమేక్‌గా అదే కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమా విడుదలకు ఇంకా మూడు రోజులే ఉండడంతో ‘కిక్ 2’ టీమ్ కూడా ప్రమోషన్స్ వేగవంతం చేసేసింది. తెలుగు సినిమాకు గత నెలరోజులుగా మంచి రోజులు నడుస్తున్న నేపథ్యంలో వస్తోన్న ‘కిక్ 2’ కూడా ఆ ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తుందని రవితేజ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆల్బమ్ సూపర్ హిట్ కాగా, దర్శకుడు సురేందర్ రెడ్డి స్టైల్ ట్రైలర్లో స్పష్టంగా కనబడుతోంది. రెండు నెలల్నుంచి ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు ఈ వారానికి ఫిక్స్ అయింది. నిర్మాత కళ్యాణ్ రామ్ కూడా ‘కిక్ 2’పై కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ లాంటి రెండు వరుస విజయాల తర్వాత తెలుగులో వస్తోన్న ఈ పెద్ద సినిమా కూడా ఆ ట్రెండ్‌లో తెలుగు సినిమాకు మరో హిట్ తెచ్చిపెడుతుందని పాజిటివ్ వైబ్రేషన్ అప్పుడే మొదలైంది. కిక్ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమా కావడం కూడా ఈ సినిమాకు మేజర్ హైలైట్. అన్ని అనుకున్నట్లుగానే జరిగి ‘కిక్ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతే ఇక తెలుగు సినిమాకు పండగే!