
సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘శ్రీమంతుడు’. ఊరిని దత్తత తీసుకునే ఓ శ్రీమంతుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన నాటినుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక సోషల్ మెసేజ్ ఉన్న కథాంశాన్ని కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన విధానానికి అన్ని వర్గాల నుంచీ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ కానెప్ట్ అయిన ఊరిని దత్తత తీసుకోవడమనే అంశం చుట్టూ తిరిగే కథ కావడంతో ఈ సినిమాపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి కనిపించింది.
ఈ క్రమంలోనే ఢిల్లీలో ఈ సాయంత్రం పలువురు ఎంపీలకు ఓ స్పెషల్ షో వేశారు. మహేష్ బావ అయిన గల్లా జయదేవతో పాటు పలువురు ఇతర ఎంపీలు ఈ షోకు విచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీమంతుడు సందడి ఢిల్లీకి కూడా పాకినట్లైంది. లోక్‍సభ, రాజ్యసభ ఎంపీలందరూ మోదీ కాన్సెప్ట్‌ను మెచ్చి ఒక్కొక్కరూ ఒక్కో ఊరిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే! ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎవరికి వారు ఓ కొత్త అనుభూతి పొందుతారనడంలో సందేహం లేదు. అదే విధంగా ఏపీ, తెలంగాణ రాజకీయ ప్రముఖులకు కూడా త్వరలోనే ఓ షో ఏర్పాటు చేయనున్నారని సమాచారం. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన శ్రీమంతుడు సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది.

