
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్నుంచీ కొంత కన్ఫ్యూజన్ ఉంది. మొదట ఈ సినిమాకు ‘మగాడు’ అన్న టైటిల్ వినిపించింది. అయితే ఆ తర్వాత సినిమా కథానుగుణంగా ‘శ్రీమంతుండు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు వినిపించింది. ఇప్పటివరకూ ఇదే టైటిల్ ప్రచారంలో ఉంటూ వస్తోంది.
తాజాగా ఈ సినిమా టైటిల్‌ను ‘శ్రీమంతుడు’ అని కాకుండా ‘మగాడు’ అనే కంటిన్యూ చేయాలని సినిమా యూనిట్ భావిస్తోందట. ఈ విషయమై రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. మరి నిజంగా మహేష్ కొత్త సినిమా టైటిల్ ఏంటన్నది తెలియాలంటే మే 31న విడుదల కానున్న టీజర్, పోస్టర్స్ వచ్చే వరకూ ఎదురు చూడక తప్పదు. మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య లాంటి భారీ తారాగణమే ఉన్నారు. జూలై 17న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.