రజనీ సినిమాకు టైటిల్ కన్‌ఫర్మ్!

rajinikanth
సూపర్ స్టార్ రజనీ అభిమానులు తమ అభిమాన హీరో హిట్ కొడితే చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కొచ్చాడయాన్’ (విక్రమ సింహ), ‘లింగా’.. ఇలా రజనీ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూడడంతో రజనీ కాంత్ కూడా ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే కొన్నాళ్ళపాటు ఏ సినిమానూ అంగీకరించని ఆయన కొత్తతరం దర్శకులైతే తనను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తారన్న నమ్మకంతో రంజిత్ అనే దర్శకుడితో ఓ సినిమా కమిటైన విషయం తెలిసిందే.

‘అట్టకత్తి’, ‘మద్రాస్’ సినిమాల ద్వారా ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న రంజిత్, రజనీ కోసం ఓ గ్యాంగ్‌స్టర్ కథను సిద్ధం చేశారు. ఇక ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ విషయంలో రకరకాల పేర్లు వినపడగా చివరగా దర్శకుడు, కబలి అనే పేరు ఖరారు చేశారు. కబాలీశ్వరన్ అనే ఓ డాన్ నిజ జీవితం నుంచి ప్రేరణ పొందిన సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. కబలిలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించనున్నారు. కళైపులి ఎస్. థాను నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.

Exit mobile version