కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘ఢీ’ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ.. బీజేపీలో చేరిక!

టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ నేత రామచందర్‌రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు పలువురు యువతీయువకులు, కళాకారులు కూడా ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు ఆకర్షితులై శ్రష్టి వర్మ వంటి యువ ప్రతిభావంతులు పార్టీలోకి రావడం శుభపరిణామమని అన్నారు.

ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి: శ్రష్టి వర్మ

పార్టీలో చేరడంపై శ్రష్టి వర్మ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం ప్రాథమిక సభ్యత్వం మాత్రమే కాదని, ఒక బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన బీజేపీ నాయకత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.

బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ, అనంతరం సినీ పరిశ్రమలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. పలు చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన ఆమె, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

Exit mobile version