
11 ప్లస్ మూవీస్ బ్యానర్‌పై జైపాల్ యేలేటి నిర్మిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘చిరు గొడవలు’. త్రికరణ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ సినిమాలో రోహిత్, భవిక, సిద్ధార్థ్, రాగ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు త్రికరణ్ రెడ్డి మాట్లాడుతూ సినిమా విశేషాలను, దర్శకుడిగా తన ప్రయాణం గురించి మీడియాతో ముచ్చటించారు.
ఎన్నారై అయిన తాను సినిమాలంటే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చానని తెలుపుతూ.. “సినిమాలంటే ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చి నాకిష్టమైన దర్శకుడు త్రివిక్రమ్ గారిని కలిశా. ఆయనిచ్చిన సలహా మేరకు అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో దర్శకత్వం గురించి ఒక కోర్స్ చేశా. అక్కడే ఒక 11 మంది టీమ్‌ను ఏర్పాటు చేసుకొని వారందరితో కలిసి చిరు గొడవలు పేరుతో ఒక మంచి రొమాంటిక్ కామెడీ కథ తయారు చేశా. అనుకున్న బడ్జెట్లో అనుకున్న పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే సినిమాగా చిరు గొడవలు నిలుస్తుందని చెప్పగలను” అని తెలిపారు.
ఒక ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు ప్రేమజంటల మధ్య సాగే కథగా రూపొందిన ఈ సినిమాలోని సున్నితమైన అంశాలు అందరికీ నచ్చుతాయని దర్శకుడు త్రికరణ్ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఇక చిన్న సినిమా కావడం, అంతా కొత్తవాళ్ళతోనే రూపొందిన సినిమా కూడా కావడంతో రిలీజ్‌కు ఎవ్వరూ ఆసక్తి చూపలేదని, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఈ విషయంలో చొరవ తీసుకొని స్వయంగా విడుదల చేయడం సంతోషాన్నిచ్చిందని త్రికరణ్ తెలియజేశారు.