
గత కొద్ది కాలంగా హీరో హీరోయిన్లు తమ సినిమాల్లో నటులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే, స్పెషల్ అట్రాక్షన్ కింద పాటలు పాడడం ప్రత్యేకంగా కనిపిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ ఈ ట్రెండ్ బాగా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు అదే కోవలో స్టార్ హీరోయిన్ త్రిష కూడా తన కెరీర్‌కు ప్రత్యేకంగా నిలిచే సినిమా అంటూ ప్రచారం పొందుతోన్న ‘నాయకి’లో ఓ పాట పాడనున్నారు. గోవీ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఇక తమ సినిమా ఫస్ట్‌లుక్‌కు ఈ స్థాయి రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో.. నాయకి సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా అందరినీ కట్టిపడేసే ఓ ఆసక్తికర కథతో నడుస్తుందని, కచ్చితంగా ఫస్ట్‌లుక్‌తో మెప్పించినట్లుగానే సినిమాతోనూ మెప్పిస్తామని తెలిపారు. ఈ సినిమా కోసం త్రిషతో ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా పాడిస్తున్నామని దర్శకుడు గోవి ఈ సందర్భంగా తెలిపారు. త్రిషతో పాడించే ప్రమోషనల్ సాంగ్‌కు ట్యూన్ సిద్ధమైందని, రఘుకుంచె ఓ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే ఈ పాట రికార్డింగ్ జరిపి, విడుదలకు సిద్ధం చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం నాయకి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకొని, రెండో షెడ్యూల్ మొదలుపెట్టే పనుల్లో ఉంది.

