త్రివిక్రమ్ తర్వాతి సినిమా ‘కోబలి’యేనా?

Trivikram-srinivas
తన మాటల మ్యాజిక్‌తో, భావోద్వేగపూరిత సన్నివేశాలతో తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్. తాజాగా అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకొని విజయం సాధించింది. ఈ సినిమా విడుదలై దాదాపుగా ఒక నెల దాటిపోయినా కూడా త్రివిక్రమ్ ఇంకా తన కొత్త ప్రాజెక్టు విషయమై స్పష్టమైన సూచనలేవీ ఇవ్వలేదు.

పవన్ కళ్యాణ్ లేదా మహేష్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. ‘కోబలి’ పేరుతో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించే ఆలోచనను త్రివిక్రమ్ ఇంతకుముందే తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ పరిశోధన సైతం చేశారు. పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా చేయనున్నట్లు అప్పట్లోనే తెలిపారు. అయితే ప్రస్తుతానికి పవన్ ‘గబ్బర్ సింగ్ 2’తో పాటు కొన్ని ఇతర రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు కూడా ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, పూరీ జగన్నాథ్ సినిమా.. ఇలా వరుస సినిమాలతో మరో సంవత్సరం వరకూ బిజీగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తన ఆప్త మిత్రుడు సునీల్‌తో ఓ సినిమా చేయనున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికి అందుతున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ తనకు కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేయగలదని నమ్ముతున్న ‘కోబలి’పైనే పూర్తి శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది. కోబలి స్క్రిప్ట్‌నే బలంగా రాసుకొని ఓ మెమోరబుల్ సినిమాను అందించాలన్న ప్రయత్నం త్రివిక్రమ్ చేసుకుంటున్నారట. ఇన్ని రకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తదుపరి చిత్రమేంటన్నది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే!

Exit mobile version