మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా ఎంతో సంతోషంలో ఉన్నారు. ‘మన శంకర వరా ప్రసాద్ గారు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఒకెత్తు అయితే, తన కుమారుడు రామ్ చరణ్ మరియు కోడలు ఉపాసనలకు కవలలు జన్మించడంతో ఆయన ఆనందం రెట్టింపు అయ్యింది. ఈ ఉత్సాహంలోనే ఆయన బాబీ దర్శకత్వంలో తన నెక్స్ట్ చిత్రం ‘మెగా 158’ (Mega 158) కోసం సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కె. నారాయణ నిర్మిస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ కొన్ని ఆర్థికపరమైన చిక్కుల్లో పడటంతో చిరు సినిమాకు బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. గతంలో కె. నారాయణ నిర్మించిన విజయ్ ‘జన నాయగన్’ చిత్రం సెన్సార్ వివాదాల వల్ల విడుదల ఆగిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది. పంపిణీదారులు అడ్వాన్స్‌లు వెనక్కి అడగటం, థియేటర్ల ఒప్పందాలు రద్దు కావడం మరియు పెరుగుతున్న వడ్డీల వల్ల ప్రొడక్షన్ హౌస్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. మరోవైపు యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా పనుల్లో కూడా వారు బిజీగా ఉండటంతో, నిధుల సర్దుబాటు కష్టంగా మారింది.
ఈ పరిస్థితుల వల్ల ‘మెగా 158’ (Mega 158) షూటింగ్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే మరికొన్ని నెలల ఆలస్యంగా ఈ సినిమా పట్టాలెక్కుతుంది, లేదంటే ఈ ప్రాజెక్ట్ వేరే నిర్మాణ సంస్థ చేతుల్లోకి మారే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిరంజీవి-బాబీ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్న తరుణంలో ఈ వార్త మెగా అభిమానుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది.
