ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ ఒక భారీ బ్లాక్బస్టర్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ వేసవిలో పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో థియేటర్ల వద్ద సందడి తగ్గింది. గత వారం విడుదలైన చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఆశించిన స్థాయిలో టాక్ రాకపోవడంతో ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద నీరసం కనిపిస్తోంది.
ఇలాంటి తరుణంలో మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వాలా 2’ తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కడ ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఆల్-టైమ్ టాప్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమాపై ఇక్కడ మంచి అంచనాలు ఉన్నాయి. సవిన్ ఎస్ఏ దర్శకత్వంలో వచ్చిన ఈ కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామా యువతకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకువస్తుండటంతో ప్రమోషన్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలేవీ లేవు కాబట్టి, ‘వాలా 2’ చిత్రానికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మలయాళంలో లాగే ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ వస్తే, ఈ వేసవికి టాలీవుడ్లో ఈ డబ్బింగ్ సినిమానే పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది.


