
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమ అయిన ఆరడుగుల కుర్రాడు వరుణ్ తేజ్. ముకుంద సినిమాతో ఆకట్టుకున్న వరుణ్ తేజ్ రెండవ సినిమా ‘కంచె’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయ్యింది. నేటి నుంచి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. నిన్నటితో కంచె సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన వరుణ్ తేజ్ ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా తన మూడవ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టాడు. వరుణ్ తేజ్ తన మూడవ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో చేయనున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసిన పూరి జగన్నాధ్ వరుణ్ తేజ్ సినిమాకి ‘లోఫర్’ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసాడు. ‘కొత్త రోజు.. కొత్త బిగెనింగ్..పూరి జగన్నాధ్ తో చేస్తున్న నా మూడవ సినిమాని ఈ రోజు మొదలు పెడుతున్నామని’ వరుణ్ తేజ్ ట్వీట్ చేసాడు. ఈ సినిమా ద్వారా పూరి బాలీవుడ్ న్యూ కమర్ అయిన దిశా పటానిని హీరోయిన్ గా పరిచయం చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించనున్నారు. పూరి జగన్నాధ్ ఈ సినిమాని ఆగష్టు చివరి కల్లా పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం సిద్దమవుతాడు.