విజయవాడలో వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వెండితెర & ఓటీటీ అవార్డుల ప్రదానం

విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో వీబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆధ్వర్యంలో ‘వెండితెర & ఓటీటీ అవార్డ్స్’ వేడుక జరిగింది. సినీ, ఓటీటీ విభాగాల్లో ప్రతిభ చూపిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు. నటులు వడ్డే నవీన్, రాజీవ్ కనకాల, సంగీత దర్శకుడు రఘు కుంచె, అనితా చౌదరి తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. అలాగే పలువురు పేద కళాకారులకు ఆర్థిక సాయం అందించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి అవార్డుల వేడుకలు ఎంతో దోహదపడతాయని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కళాకారుల ప్రతిభను గుర్తించి ఏటా సత్కరించడం అభినందనీయమని మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ అంబికా కృష్ణ పేర్కొన్నారు.

​కార్యక్రమంలో పాల్గొన్న ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ రామారావు మాట్లాడుతూ, ప్రభుత్వం త్వరలోనే నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. వీవీకే హౌసింగ్ ఇండియా ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన ఈ వేడుకకు పలు వ్యాపార, విద్యా సంస్థలు సహకారం అందించాయి.

Exit mobile version