‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రంతో వెంకీ అట్లూరి విజయపథంలో దూసుకుపోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి స్పందన లభించడంతో, ఇప్పుడు ఆయన తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఐతే, ఓ ఇంటర్వ్యూలో, మెగాస్టార్ చిరంజీవి కోసం తనకున్న ఆలోచన గురించి వెంకీ ప్రస్తావించారు. చిరంజీవి కోసం తన దగ్గర ఒక కథాంశం ఉందని, అయితే అంత భారీ స్థాయి చిత్రాన్ని చేపట్టేందుకు తనకు మరికొంత పరిణితి, సమయం అవసరమని వెంకీ చెప్పుకొచ్చారు.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘నాకు చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో అభిమానం. అలాంటి స్టార్ హీరోని సంప్రదించే ముందు దర్శకుడిగా అన్ని విధాలా సంసిద్ధంగా ఉండాలని నేను నమ్ముతాను. అలాగే వెంకీ చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చిరంజీవి కోసం అనుకున్న కథాంశం ఒక ‘థ్రిల్లర్’ అని వెంకీ వెల్లడించారు. మొత్తమ్మీద ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
