
సరికొత్త కథాంశాలతో రూపొందిన సినిమాలతో మనముందుకు వచ్చి, వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకున్న హీరో నిఖిల్. తెలుగులో ఏ హీరోకైనా హ్యాట్రిక్ హిట్ అన్నది అంత ఈజీ విషయం కాదు. నిఖిల్ ఆ ఘనతను కూడా సొంతం చేసుకొని ప్రస్తుతం ‘శంకరాభరణం’తో మరో సరికొత్త క్రైమ్ కామెడీ చేస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్ట్ సమకూర్చడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజాగా ‘శంకరాభరణం’ గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా నటిస్తున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజయ్, తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. గతంలో ఆంఖో దేఖీ అనే సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా అందుకున్న ఈ నటుడు, శంకరాభరణంతో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారని కోన వెంకట్ తెలిపారు. కొత్త దర్శకుడు ఉదయ్ నందనవనం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత కాగా నందిత హీరోయిన్.