కోలీవుడ్ స్టార్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జన నాయగన్’ సెన్సార్ పరంగా ఉన్న అతిపెద్ద అడ్డంకిని అధిగమించింది. గత వారం ఈ చిత్రానికి లభించిన ‘A’ సర్టిఫికేట్ తర్వాత, బోర్డు సూచించిన మార్పుల ప్రకారం సవరించిన కొత్త సర్టిఫికేట్ను సీబీఎఫ్సీ జారీ చేసింది.
దీంతో దాదాపు ఏడు నెలలుగా సాగుతున్న సెన్సార్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఈ లేటెస్ట్ కట్స్ తర్వాత చిత్రానికి అదనంగా 41 సెకన్ల ఫుటేజ్ యాడ్ అవ్వడంతో, సినిమా ఫైనల్ రన్టైమ్ 3 గంటల 3 నిమిషాల 52 సెకన్లుగా లాక్ అయింది. రాజకీయ అంశాలు, కీలక సీన్లపై అభ్యంతరాల కారణంగా గత ఏడాది డిసెంబర్ నుండి నిలిచిపోయిన ఈ చిత్ర సర్టిఫికేషన్ ప్రక్రియ.. కోర్టులు, రివైజింగ్ కమిటీల చుట్టూ తిరిగి ఎట్టకేలకు క్లియరెన్స్ సాధించింది.
ఇదే సమయంలో సినిమాలోని కొన్ని భాగాలు పైరసీ కావడం నిర్మాతలను తీవ్రంగా ఆందోళనకు గురిచేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


