ఓటీటీ వేదిక : జియో హాట్‌స్టార్
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మార్చి 27, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: విజయ్ సేతుపతి, మిలింద్ సోమన్, వడివేల్ మురుగన్, ముత్తుకుమార్, వీజే పార్వతి, రిచా జాకబ్ తదితరులు
దర్శకత్వం: మణికందన్, బి.అజిత్ కుమార్
నిర్మాతలు: విజయ్ సేతుపతి
సంగీతం: రాజేష్ మురుగేశన్
సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, షణ్ముగ సుందరం
ఎడిటింగ్ : బి.అజిత్ కుమార్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ డైరెక్షన్లో రూపొందిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కాట్టాన్’ (Kaattaan). ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
Kaattaan కథ:
తమిళనాడు అటవీ ప్రాంతంలోని ఒక చిన్న పోలీస్ స్టేషన్ పరిధిలో మొండెం లేని ఒక తల లభ్యమవుతుంది. కానిస్టేబుల్ కాళి పాండియన్ (వడివేల్ మురుగన్), ఎస్ఐ సిద్ధార్థన్ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుంటారు. ఇన్వేస్టిగేషన్‌లో ఆ వ్యక్తి పేరు ముత్తు అలియాస్ కాట్టాన్ (Kaattaan) (విజయ్ సేతుపతి) అని తెలుస్తుంది. అసలు ముత్తు ఎవరు? గ్యాంగ్‌స్టర్ శివన్న (మిలింద్ సోమన్) దగ్గర పనిచేసిన ముత్తు, ఒక డాన్స్ గ్రూప్‌లో మేనేజర్‌గా ఎందుకు చేరాడు? అతడు ప్రేమించిన సింధు, మీనాల కథ ఏమిటి? ముత్తు హత్య వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఎలా ఛేదించారు..? అనేదే ఈ 10 ఎపిసోడ్ల సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సిరీస్‌కు ప్రధాన బలం విజయ్ సేతుపతి. ముత్తు పాత్రలో ఆయన మాసీ లుక్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. ప్రేమికుడిగా, రివెంజ్ కోసం రగిలిపోయే వ్యక్తిగా డిఫరెంట్ షేడ్స్‌లో మెప్పించాడు. తన పాత్రలో ఒదిగిపోయిన విజయ్ సేతుపతి ఈ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటాడు.
ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కొన్ని ఎపిసోడ్స్‌లో సినిమా రేంజ్ షాట్స్ పడటం విశేషం. రాజేష్ మురుగేశన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. జాతర నేపథ్యంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఈ సిరీస్‌కే హైలైట్ అని చెప్పాలి.
ఇక ఈ వెబ్ సిరీస్‌ను నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లే పద్ధతిలో వివరించడం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తర్వాత ఏం జరగబోతుందా అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేశారు.
మైనస్ పాయింట్స్:
ఈ వెబ్ సిరీస్‌కు మేజర్ డ్రాబ్యాక్ దీని రన్‌టైమ్ అని చెప్పాలి. 10 ఎపిసోడ్లను దర్శకుడు సాగదీశాడు. చాలా సీన్స్ అనవసరంగా అనిపిస్తాయి. ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ను కంప్లీట్ చేయాలంటే చాలా ఓపిక అవసరం ఉంటుంది. 5 లేదా 6 ఎపిసోడ్లలో ముగించాల్సిన ఈ వెబ్ సిరీస్‌ను అనవసరపు డీటైలింగ్‌తో సాగదీశారు.
కొన్ని ట్విస్ట్‌లు మినహా కథ అంతా ప్రేక్షకులు ఊహించినట్టే సాగుతుంది. పోలీసులు ఒక హత్య కేసును ఇన్వేస్టిగేషన్ చేసే విధానంలో సీరియస్‌నెస్ లోపించినట్లు అనిపిస్తుంది. ఇక కానిస్టేబుల్ ఫ్యామిలీ సీన్లు కేవలం వెబ్ సిరీస్ లెంగ్త్ పెంచడానికే తప్ప కథకు ఏమాత్రం ఉపయోగపడలేదని చెప్పాలి.
అటు ముత్తుతో సింధు, మీనా లవ్ స్టోరీస్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టవు. రొటీన్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను మెప్పించలేక పోతాయి. బెన్నీ, శివన్న పాత్రలతో ముత్తు సంబంధాన్ని ఇంకాస్త ఎంగేజింగ్‌గా రాసుకుంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
నేషనల్ అవార్డ్ విన్నర్ మణికందన్ ఎంచుకున్న కథ పాతదే అయినా, దాన్ని చెప్పిన విధానం బాగుంది. అయితే, వెబ్‌సిరీస్ లెంగ్త్ విషయంలో ఆయన పట్టు కోల్పోయారు. ప్రతి పాత్రను డెప్త్‌గా పరిచయం చేయాలనే ఉద్దేశంతో కథనాన్ని చాలా నెమ్మదిగా నడిపించారు. రాజేష్ మురుగేశన్ అందించిన బీజీఎం ఈ సిరీస్‌కు బలంగా నిలిచింది. ముఖ్యంగా విజయ్ సేతుపతి ఎలివేషన్ సీన్స్‌లో మరియు జాతర యాక్షన్ ఎపిసోడ్లో బిజీఎమ్ బాగుంది. అటవీ ప్రాంతం మరియు పల్లెటూరి వాతావరణాన్ని కెమెరామెన్ చాలా సహజంగా చూపెట్టారు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. చాలా సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే ఈ సిరీస్ లెంగ్త్ తగ్గేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ కొన్ని చోట్ల మెప్పించలేదు.
తీర్పు:
ఓవరాల్‌గా చూస్తే, ‘కాట్టాన్’ (Kaattaan) ఒక రొటీన్ రివెంజ్ డ్రామా వెబ్ సిరీస్‌గా లెంగ్తీ రన్టైమ్తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. విజయ్ సేతుపతి వన్ మ్యాన్ షో మరియు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సిరీస్‌కు ప్లస్ అయ్యాయి. స్లో నెరేషన్, లెంగ్తీ రన్ టైమ్, ఆకట్టుకోని సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ మినహా పెద్దగా ఈ సిరీస్‌లో చెప్పుకునేందుకు ఏమీ లేదు. రివెంజ్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను చాలా తక్కువ అంచనాలు, ఎక్కువ ఓపికతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team
