మా స్క్రిప్ట్ లోని సీన్స్ హాలీవుడ్ సినిమాలో చూసి షాక్ అయ్యాం – శివాజీ

మా స్క్రిప్ట్ లోని సీన్స్ హాలీవుడ్ సినిమాలో చూసి షాక్ అయ్యాం – శివాజీ

Published on Jul 6, 2014 8:56 PM IST

shivaji

ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. ఇటీవల కాలంలో సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల్లో, సామాజిక సేవలో బిజీగా ఉన్న శివాజీ మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్నాడు. శివాజీ హీరోగా త్వరలో రానున్న సినిమా ‘బూచమ్మ బూచోడు’. హర్రర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా విశేషాలను శివాజీ ప్రెస్ మీట్లో మీడియాతో పంచుకున్నాడు.

ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ ‘బూచమ్మ బూచోడు’ అనేది ఆద్యంతం నవ్విస్తుంది. అలాగే కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. భార్యా భర్తలైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాల్లో జరిగిన సంఘటనలే ఈ సినిమా. ఓ సూపర్ సినిమా అని చెప్పను కానీ ఇదొక స్క్రీన్ ప్లే బేస్ మూవీ. కానీ హర్రర్ సినిమాల్లో మాత్రం కొత్త తరహా చిత్రమని మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. హాలీవుడ్ లో కూడా ఇలాంటి తరహా మూవీ రాలేదు. అలాగే ఒకటిన్నర సంవత్సరం క్రితం ఈ సినిమా స్క్రిప్ట్ కానే ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మాకందరికీ షాక్ ఇచ్చినది ఏమిటి అంటే ఇటీవలే వచ్చిన ‘ది కాంజురింగ్’ అనే సినిమాలో మేము రాసుకున్న రెండు సీన్స్ ఉన్నాయి. అవి చూసి షాక్ అయ్యాం. కానీ మేము కొత్తగా ట్రై చేస్తున్నామని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత మళ్ళీ మా సినిమాలో ఆ సీన్స్ మార్చి తీసామని’ అన్నాడు.

అలాగే మాట్లాడుతూ ‘నేను ఇటీవలే ఇండస్ట్రీ గురించి చెబితే అందరూ ఇండస్ట్రీ నలుగురు చేతిలోనే ఉందని రాసారు. అది చాలా తప్పు నేను అలా అనలేదు. నేను అన్నది ఇండస్ట్రీలో గ్రూపిజం అయిపొయింది. దానివల్ల ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ ఉన్న టాప్ హీరోలతోనే సినిమాలు రిపీటెడ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. దానివల్ల సినిమాలు తక్కువైపోతున్నాయి. ఈ గ్రూపిజం వల్ల నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీ త్వరలోనే కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. అలా అని చిన్న సినిమాలకు సరైన మనుగడ లేదంటే నేను ఒప్పుకోను ఎందుకంటే సరైన సినిమాలు తీస్తే ఆడుతాయి, థియేటర్లు కూడా దొరుకుతాయి. కానీ కొంతమంది సినిమాలు ఎలా తీయాలో సరైన అవగాహన లేని మనవాళ్ళు నష్టాలు పాలవుతున్నారని’ అన్నాడు.

అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూ ‘మన దేశంలో జాతీయవాదం కంటే ప్రాంతీయ వాదం ఎక్కువ ఉంది. ప్రస్తుతం ప్రాంతీయ భావంతో దేశం నాశానమైపోతోంది. ఎప్పుడైతే ప్రాంతీయ వాదం అనేది కనుమరుగై అందరూ జాతీయ వాదంకి ప్రాముఖ్యత ఇస్తారో అప్పుడు దేశం బాగుంటుందని’ అన్నాడు.

తాజా వార్తలు