ఆది ‘మలుపు’ తెలుగులో రిలీజెప్పుడు..?

malupu-still
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది, హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే! తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు హీరో ఇక్కడా ‘వైశాలి’, ‘గుండెల్లో గోదారి’ లాంటి సినిమాల ద్వారా మెప్పించారు. తాజాగా రవిరాజా పినిశెట్టి తన పెద్ద కుమారుడు సత్య ప్రభాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చిన్న కుమారుడు ఆది హీరోగా ఓ సినిమా రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులో ‘మలుపు’ అనే పేరు పెట్టారు.

తమిళంలో ‘యాగవారియునుమ్ నా కాక్క’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా గత వారమే విడుదల కాగా తెలుగు వర్షన్ ఊసే లేదు. తెలుగులో ఇప్పటికే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకున్నా సినిమా ఇంకా విడుదల కాలేదు. టెక్నికల్‌ అంశాల పరంగా మంచి మార్కులే కొట్టేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లోని మెసేజ్‌ను తమిళ ప్రేక్షకులు మెచ్చుకున్నారు. మరి ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయంలోనే ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడం గమనార్హం. మరి తెలుగులో మలుపు ఎప్పుడు రానుందనేది సినిమా యూనిటే తేల్చాలి.

Exit mobile version